Amazon Data Center: తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు సింగిల్ విండో వ్యవస్థ ద్వారా త్వరగా అనుమతులు ఇస్తున్నామని, పెట్టుబడుల అమలుపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.

అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం చేయడం, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించడం లక్ష్యమని స్పష్టం చేశారు. ఐఎస్‌బీ, నల్సార్‌తో సహా అనేక సంస్థలతో కలిసి పని చేస్తున్నామని, పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కీలక పాత్ర పోషించనుందని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణ అభివృద్ధిలో ఓఆర్‌ఆర్, విమానాశ్రయం, ఫార్మా కంపెనీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని, దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. పరిశ్రమలు, టూరిజం, క్రీడలు, వైద్య రంగాల్లో సానుకూల పాలసీలు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని 3 వేల ఆర్టీసీ బస్సులు, 2 లక్షల ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం, ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్‌పై జీరో ట్యాక్స్ అమలు చేయడం, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఫార్మా పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలించడం వంటి చర్యలు చేపట్టామని వివరించారు. కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం పేర్కొన్నారు.

అమెజాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పన్నెండేళ్ల వ్యవధిలో రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా అవగాహనకు వచ్చింది. ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందన్‌వెల్లిలో 98 ఎకరాలు కేటాయించి, రూ. 125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలు అందించింది. తొలి విడతలో 24 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి, మిగిలిన పనులను 10 ఏళ్లలో పూర్తి చేస్తారు.

హైదరాబాద్‌లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, డిజిటల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ డిజిటల్ సేవలు, స్టార్టప్‌లు, పరిశ్రమల అవసరాలకు డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ ప్రాజెక్టు తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు, టెక్నాలజీ రంగ విస్తరణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story