Minister Ponguleti Srinivasa Reddy: రాజధాని హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల (ఫ్లాట్ల) నిర్మాణ పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం , దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అజారుద్దీన్ సమక్షంలో ఈ పథకం అధికారికంగా ప్రారంభించారు. పథకం విధి-విధానాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానాలపై పూర్తి వివరాలు కలిగిన ప్రకటనను విడుదల చేశారు.

ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పరిధుల్లో మొత్తం లక్ష ఫ్లాట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల పేదలకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుంది. ప్రభుత్వ భూములపై హౌసింగ్ బోర్డు టవర్ల రూపంలో ఫ్లాట్లు నిర్మించనుంది. తొలి విడతలో 26 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి సుమారు 500 ఫ్లాట్ల చొప్పున నిర్మాణం చేపట్టనున్నారు.

ప్రయోజనాలు:

ప్రభుత్వం ఉచితంగా స్థలం అందించనుంది.

రూ.5 లక్షల సబ్సిడీ ఇవ్వనుంది.

లబ్ధిదారుల వాటా సుమారు రూ.6 లక్షలుగా నిర్ణయించారు.

ఎల్‌ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు ఫీజు రూ.100 మాత్రమే.

ఈఎండీ రూ.10 వేలు (ఫ్లాట్ రాకపోతే తిరిగి ఇవ్వబడుతుంది).

ఫ్లాట్ల కోసం రేపటి నుంచి (జూలై 22) నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఎల్‌ఐజీ ఫ్లాట్ల బ్రోచర్ మరియు అప్లికేషన్ ఫారాలను మంత్రులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “పేదవాడి చిరుకోరిక సొంత ఇల్లు. గజం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల విలువ ఉన్న ప్రాంతాల్లో కూడా ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలోనే సొంత ఇల్లు కలలు సాకారం అవుతాయి” అని తెలిపారు.

ఈ పథకం ద్వారా హైదరాబాద్‌లోని పేదలు, మధ్య తరగతి వర్గాలు సులువుగా సొంత నివాసం కల్పించుకోవడం సాధ్యమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు వివరాలు, అర్హతల కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా స్థానిక హౌసింగ్ బోర్డు కార్యాలయాలను సంప్రదించాలి.

Next Story