Minister Uttam Kumar Reddy: ప్రాజెక్టుల కింద వరి సాగు వద్దు.. సాగునీటికి రూ.5 వేల కోట్ల నిధులు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Minister Uttam Kumar Reddy: ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలతో రాష్ట్రంలో కొంత ఉపశమనం లభించినప్పటికీ, ప్రాజెక్టుల కింద ఉన్న రైతులు ఇప్పుడు వరి సాగుకు వెళ్లడం సముచితం కాదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకసారి తడి అందే అవకాశం ఉన్నా, రెండోసారి నీరందించే పరిస్థితి అనిశ్చితంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రైతులను ప్రోత్సహించి పంట వేయించి, రెండు మూడు నెలల తర్వాత ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని పేర్కొన్నారు.
శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి కమాండ్ ఏరియాలో ఎంత మేరకు సాగునీరు అందించగలమో, ఎక్కడ పరిమితులున్నాయో కలెక్టర్లు, నీటిపారుదల ఇంజినీర్లు, వ్యవసాయ అధికారులు రైతులకు అధికారికంగా తెలియజేయాలని సూచించారు. నాగార్జునసాగర్, శ్రీరామసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదని, వాటి పరిధిలో తక్కువ నీటితో పండే పంటల సాగును ప్రోత్సహించాలని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై విచక్షణ రహితంగా నీటిని విడుదల చేయవద్దని హెచ్చరించారు.
జిల్లా నీటిపారుదల సలహా మండళ్లను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించారు. శనివారం నుంచే ఈ మండళ్ల సమావేశాలు ప్రారంభించాలని, వచ్చే వేసవిలో తాగునీటి సంక్షోభం తలెత్తకుండా ఇప్పటి నుంచే నీటి నిల్వలను పరిరక్షించాలని తెలిపారు.
ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. భూసేకరణ, పునరావాసం (R&R) కోసం ఈ నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. నిధుల కొరతతో సాగునీటి పనులు ఆగకూడదని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మిడ్‌మానేరు ఎడమ కాలువ పనులను వెంటనే పునఃప్రారంభిస్తామని చెప్పారు. పత్తిపాక రిజర్వాయర్‌ను ఫాస్ట్‌ట్రాక్‌లో పూర్తి చేయాలని ఆదేశించారు. దీని ద్వారా కొత్తగా 10 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు.
రోళ్లవాగు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించామని, 96 శాతం పనులు పూర్తైన ఈ ప్రాజెక్టు ద్వారా 15 వేల ఎకరాల చివరి ఆయకట్టుకు నీరు అందజేస్తామని తెలిపారు. 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యమని, ఆగస్టు నెలాఖరులోగా పత్తిపాక డీపీఆర్ సిద్ధం చేస్తామని అన్నారు. భూసేకరణ, టెండర్లు, అనుమతులను సమాంతరంగా చేపట్టాలని, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదే సందర్భంగా ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 61 లక్షల మంది కొత్త లబ్ధిదారులను చేర్చి దాదాపు 16 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, మొత్తం 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో 3.42 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని వివరించారు. ఆగస్టు 15న ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభం కావాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

