Gutha Sukhender Reddy: మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల మధ్య అనవసరమైన జల వివాదాలు సృష్టించే విధంగా నీటిపారుదల శాఖాధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సరికాదని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో చిట్‌చాట్‌ నిర్వహించిన ఆయన ఈ మేరకు అభిప్రాయపడ్డారు.

మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. ఏదుల రిజర్వాయర్‌ నుంచి రోజుకు 1.5 టీఎంసీల నీటిని పాలమూరు ప్రాంతానికి, 0.5 టీఎంసీల నీటిని డిండి ఎత్తిపోతల పథకానికి కేటాయించేందుకు ఇటీవలే మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తూ కొందరు మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. అనవసరమైన వివాదాలు సృష్టించి సీఎం రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

నార్లాపూర్‌ నుంచి నీటిని తరలించాలంటే అదనపు ఖర్చుతో పాటు ఎక్కువ సమయం పడుతుందని, అటవీ, ఇతర శాఖల నుంచి అనుమతుల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా దశాబ్దాల నుంచి ఫ్లోరైడ్‌ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతమని, సురక్షితమైన తాగునీటితో పాటు సాగునీటి వనరులు కూడా అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులు పరస్పరం చర్చించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story