బనకచర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీదా చంద్రబాబుదా – హరీష్ రావు

బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే చంద్రబాబు నాయుడి స్క్రిప్ట్‌లా ఉందని మాజీ మంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చేసిందా చంద్రబాబు చేసిందా అని ఆయన ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే బనకచర్లపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు బీఆర్‌ఎస్ సిద్దంగా ఉందని రేవంత్ రెడ్డి సిద్దమా అని అడిగారు. అధికారంలో ఉన్న లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పనిచేస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు. రాజకీయాల కోసం మాపై బుదరజల్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీయం మాట్లాడే మాటలను పత్రికలు క్రాస్ చెక్ చేసుకోవాలని హరీష్ రావు సూచించారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ప్రతిపక్షాలను ఎందుకు పిలవలేదని హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. కాళేశ్వరం, డిండి ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకోలేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పేరుకే కాంగ్రెస్ ముఖ్యమంత్రని ఆయన హృదయం అంతా బీజేపీలోనే ఉందన్నారు. విజయవాడ సాక్షిగా బజ్జీలు తిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్లకు పచ్చజెండా ఊపిండని హరీష్ రావు విమర్శించారు.
