Bandi Sanjay Slams KCR: బండి సంజయ్ ధ్వజం: కృష్ణా నీటి ద్రోహం చేసింది కేసీఆరే... తెలంగాణను నాశనం చేసింది ఆయన కుటుంబమే!
తెలంగాణను నాశనం చేసింది ఆయన కుటుంబమే!

Bandi Sanjay Slams KCR: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాల విభజనలో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేసీఆరే కారకుడని, రాష్ట్రాన్ని ఆయన కుటుంబం పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్... కృష్ణా నది జలాల్లో మొత్తం 811 టీఎంసీల్లో తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉండగా, కేవలం 299 టీఎంసీలకే కేసీఆర్ సమ్మతి తెలిపారని విమర్శించారు. ఈ విషయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఎపెక్స్ కమిటీ సమావేశంలో ప్రస్తావించారని గుర్తు చేశారు. దీనివల్లే రాష్ట్రానికి భారీ అన్యాయం జరిగిందన్నారు.
అవసరమైతే ఈ ఒప్పందాలను బయటపెట్టడానికి సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగినా, ప్రస్తుత ప్రభుత్వం కేవలం రూ.9 వేల కోట్ల అక్రమాలకే విచారణను పరిమితం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ప్రభాకర్ రావు వేలాది మంది జీవితాలను నాశనం చేశారని, ఈ కేసులో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని, ఆరు వేలకు పైగా ఫోన్లను ట్యాప్ చేయించారని ఆరోపణలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై వాడిన భాష సరికాదని, ఇకపై అలాంటి మాటలు మానుకోవాలని బండి సంజయ్ సూచించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం సర్వనాశనం చేసిందని ప్రజలు గుర్తించి, ఆయనను ఫాంహౌస్‌కే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.
కేంద్ర నిధులపై సీఎం అంగీకారమే...
రాష్ట్రానికి కేంద్రం నిధులు సమృద్ధిగా ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారని బండి సంజయ్ తెలిపారు. పంచాయతీలకు రూ.3 వేల కోట్లు రాబోతున్నాయని సీఎం చెప్పినా, కేంద్రం ఏమీ ఇవ్వలేదని పదేపదే అనడం సరికాదన్నారు. ఆరు గ్యారంటీలను ప్రజల పన్నులతోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ క్యాబినెట్‌లో కొందరు మంత్రులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా వారి అక్రమాలను త్వరలో బయటపెడతామని హెచ్చరించారు.
దానం నాగేందర్ కాంగ్రెస్‌లోనే ఉన్నానంటున్నా, స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో కాంగ్రెస్ ఎగిరెగిరిపడుతోందని, కానీ పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా జరుగుతాయని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి మేయర్ స్థానం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

