ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం

BC Bandh Telangana Shutdown Continues: బీసీలకు రిజర్వేషన్లలో సరైన వాటా కోసం బీసీ ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలను మినహాయించి మిగిలిన అన్ని రంగాలు బంద్‌ను పాటిస్తున్నాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్, భాజపా, భారత రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో సహా ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ సంఘాలు, విద్యార్థి ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

బంద్‌కు మద్దతుగా బీసీ సంఘాలు నిరసనలు చేపట్టాయి. జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట బీసీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు బంద్‌లో పాల్గొంటూ మద్దతు ప్రకటిస్తున్నాయి.

హైదరాబాద్‌లో బంద్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉప్పల్, చెంగిచర్ల డిపోల వద్ద నేతలు బస్సులను అడ్డుకున్నారు. కూకట్‌పల్లి డిపోలో సుమారు 125 బస్సులు నిలిచిపోవడంతో ప్రజా రవాణా స్తంభించింది. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

దిల్‌సుఖ్‌నగర్‌లో బంద్ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డిపో ఎదుట, రోడ్లపై నేతలు బైఠాయించి బస్సులను నిలిపివేశారు. కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు, కుల సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

సికింద్రాబాద్‌లో బంద్ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్‌తో సహా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద ధర్నాలో భాజపా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ వద్ద తెలంగాణ బీసీ ఐకాస నేతలు బస్సులను అడ్డుకున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్‌తో ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. మహబూబ్‌నగర్ డిపో ముందు ధర్నాలో భారత రాష్ట్ర సమితి నేత శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్, వికారాబాద్ డిపోల వద్ద నేతలు ఆందోళనలు చేపట్టారు.

బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని డీజీపీ సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story