CM Revanth Reddy: వికసిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కండి.. డీఎస్పీలకు రేవంత్ దిశానిర్దేశం
డీఎస్పీలకు రేవంత్ దిశానిర్దేశం

CM Revanth Reddy: ఇటీవల పోలీస్‌శాఖలో చేరిన 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలను ఉద్దేశించి మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
‘‘మీరే తెలంగాణ సంపద. విధ్వంసమైన రాష్ట్రాన్ని మీరు వికాసం వైపు నడిపించాలి. మీ నియామకాలను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినా మా ప్రభుత్వం మీ పక్షాన నిలిచింది. నిపుణులైన న్యాయవాదులతో సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించడంతో అనుకూల తీర్పు వచ్చింది. దానివల్లే ఈరోజు మీరు డీఎస్పీలుగా నిలబడ్డారు. మీ నేపథ్యాన్ని మర్చిపోకండి. అలా జరిగితే మీ హోదాకు న్యాయం చేయలేరు’’ అని సీఎం ఉద్బోధించారు.
గత ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్సీలో జరిగిన గందరగోళం, ఆలస్యం వల్ల చాలామందికి నష్టం జరిగిందని ఆయన గుర్తుచేశారు. ‘‘నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశా. గత ప్రభుత్వం అవగాహన లేని ఆర్‌ఎంపీలు, డిప్యూటీ ఎమ్మార్వోలను బోర్డు సభ్యులుగా నియమించింది. మేం యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని తీర్చిదిద్దాం. 563 మంది నియామకాలకు నోటిఫికేషన్ ఇస్తే 562 మంది జాయిన్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్ రాలేదు. పూర్తి పారదర్శకతతో జరిగిన నియామకాల్లో ఉపాధిహామీ కూలీల పిల్లలు కూడా ఉండటం గర్వకారణం’’ అన్నారు.మీరు అదనపు డీజీపీ స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉందని, రాబోయే 30 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏ దిశగా నడిపించాలనేది మీ చేతుల్లోనే ఉందని సీఎం చెప్పారు. ‘‘క్షేత్రస్థాయిలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే ఉన్నత స్థానం మీదే. మీరు నిటారుగా నిలబడి విధులు నిర్వర్తిస్తే రాష్ట్ర ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ నుంచి ప్రభుత్వం రూపాయి కోట్లు ఆశించడం లేదు. రిగ్గింగ్ చేయించి ఓట్లు వేయించాలని కూడా అనుకోవడం లేదు. మీ హోదాను ప్రజల కోసం వాడండి. వ్యక్తిగత ప్రయోజనాలకు వాడితే మన్నిక ఉండదు’’ అని హితవు చెప్పారు.
సైబర్‌నేరాలు, మాదకద్రవ్యాలు పెనుముప్పుగా మారాయని సీఎం హెచ్చరించారు. ‘‘ఒకప్పుడు పంజాబ్ యుద్ధవీరులకు నిలయం. ఇప్పుడు అక్కడ 60 శాతం మంది మాదకద్రవ్యాల బారిన పడ్డారు. ఇక్కడ అలాంటి పరిస్థితి రాకుండా ఈగల్ ఫోర్స్‌ను తెచ్చాం. డ్రగ్స్ కేసుల్లో శిక్షలు ఒక్కటిన్నర శాతమే ఉండటం ఆందోళనకరం. ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణులు లేకపోవడమే కారణం’’ అన్నారు.
ట్రాఫిక్ సమస్యలు, ఆహార కల్తీ కూడా కొత్త సవాళ్లుగా మారాయని, వీటి నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేశామని చెప్పారు. శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, నైపుణ్యాలు ఉంటే విదేశాలకు స్టడీ లీవ్ ఇచ్చి పంపించేందుకు సిద్ధమేనని సీఎం సూచించారు.ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

