CM Revanth: భారత్ సమిట్తో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. విపక్షాల తీరుపై సీఎం రేవంత్ ఆగ్రహం
సీఎం రేవంత్ ఆగ్రహం

CM Revanth: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమని ప్రపంచానికి చాటేందుకే భారత్ సమిట్ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ఏడాది కూడా గ్లోబల్ సమిట్‌కు ముందు భారత్ సమిట్ నిర్వహించామని, ఈసారి డిసెంబరు 7-9 తేదీల్లో గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వివేక్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, గురుదీప్ సింగ్ సప్పల్‌తో కలిసి ఎంసీఆర్హెచ్ఆర్డీలో శుక్రవారం మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.
గ్లోబల్ సమిట్ కర్టెన్‌రైజర్‌లో భాగంగా బెంగళూరు, దిల్లీ, చెన్నైలలో కార్యక్రమాలు నిర్వహించామని, త్వరలో ముంబయి, అహ్మదాబాద్‌లలో నిర్వహించబోతున్నామని చెప్పారు. నవంబరు 13, 14 తేదీల్లో భారత్ సమిట్‌కు 70 దేశాలకు చెందిన వెయ్యి మంది ప్రతినిధులను ఆహ్వానించామని తెలిపారు. వారిలో కొందరికి ముందుగా అనుమతులిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆఖరి నిమిషంలో వీసాలను రద్దు చేసిందని విమర్శించారు.
భారత్ సమిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమవుతుందని కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, కేటీఆర్ ఆరోపిస్తున్నారని, తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వారు రాష్ట్ర వ్యతిరేక కార్యాచరణనే తీసుకుంటున్నారని సీఎం ఆరోపించారు. ‘సీయింగ్ ఈజ్ బిలీవ్’ విధానంలో ఇక్కడి పరిస్థితులు, పారిశ్రామిక విధానాలను చూపించడం కోసమే సమిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, తుమ్మిడిహెట్టి వంటి ప్రాజెక్టులను భాజపా, భారాస నేతలు వ్యతిరేకిస్తున్నారని, వారు కాంగ్రెస్‌ను కాదు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు.
వేల మంది గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని, తెలంగాణలో గిగ్ వర్కర్ల కోసం రూపొందించిన ప్రత్యేక విధానాన్ని శనివారం ప్రారంభించేందుకు రాహుల్ గాంధీని ఆహ్వానించామని చెప్పారు. భారత్ సమిట్‌లో ముగింపు సందేశం ఇచ్చేందుకు రాహుల్ హైదరాబాద్ వస్తే భాజపాకు సమస్య ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చైనా, పాకిస్థాన్ వెళ్లి ఉపన్యాసాలిస్తారు. కానీ క్యాబినెట్ హోదాలో ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తే భాజపా నేతలు అభ్యంతరం చెబుతున్నారని విమర్శించారు.
70 దేశాల ప్రతినిధులు తిరిగి వెళ్లేటప్పుడు తెలంగాణ అంబాసిడర్లుగా మారతారని, వారిని ఇక్కడికి పిలిపించి కొన్ని తీర్మానాలు చేయడం ద్వారా తెలంగాణ పెట్టుబడులకు అనుకూలంగా ఉందని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం అన్నారు. భారాస, భాజపా నేతలు రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని కోరారు. కిషన్‌రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలు పట్టడంలేదని, ఆయన గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. గిఫ్ట్ సిటీని తెలంగాణకు కాకుండా గుజరాత్‌కు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీని రీలాంచ్ చేయడం కోసమే ఆహ్వానించారని అనడం సరికాదని, ఆయన 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నారని, ప్రస్తుతం ప్రతిపక్ష నేత అని చెప్పారు. కేటీఆర్‌కు విజ్ఞత లేదని, ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. తన ఫోన్ ట్యాప్ అయిందని రాహుల్ చేసిన ఆరోపణలపై సీఎం స్పందిస్తూ, కేంద్రం ఒకవేళ తన ఫోన్ ట్యాప్ చేసినా నష్టం లేదని చెప్పారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు త్వరలో పూర్తవుతుందని, అందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తాయని వెల్లడించారు.

