Bhatti Vikramarka: భట్టి విక్రమార్క: అబద్ధాలు, అప్పులతో రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాశనం చేసింది
బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాశనం చేసింది

Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను తీవ్రంగా విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన తప్పులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని, అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క్, హరీశ్‌రావు అనేక విషయాల్లో అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రిగా పని చేసిన అనుభవాన్ని మరచిపోయి హరీశ్‌రావు మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ అప్పులపై తీవ్ర ఆరోపణలు
భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ, “బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద పదేళ్ల పాలన నడిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేళ్లు సీఎంగా పని చేసిన కేసీఆర్‌కు సవాల్ విసిరిన భట్టి, “2014 నుంచి 2023 వరకు వివిధ మార్గాల్లో రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇది నిజం కాదా? బుకాయింపులు, అసత్యాలతో ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు?” అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ సాధనలు
మేము అధికారంలోకి వచ్చాక రూ.2.08 లక్షల కోట్ల అప్పులు చెల్లించామని భట్టి తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో 10 శాతం వడ్డీకి అప్పులు తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కట్టాల్సిన వడ్డీని రూ.34 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు తగ్గించామని వివరించారు. సింగరేణి విషయంలో కూడా బీఆర్‌ఎస్ నేతలు ప్రతిరోజూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య అప్పులు, అభివృద్ధి అంశాలపై తీవ్రమైన విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.

