ఇండియా టుడే సదస్సులో ఉపముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

Bhatti Vikramarka: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ప్రజల్లో విశ్వాసం కలిగించడం ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రథమ కర్తవ్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసీ తన నిష్పాక్షికతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం కేరళలోని కొచ్చిన్‌లో జరిగిన ఇండియా టుడే సదస్సులో మాట్లాడుతూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలోనే నిర్వహించాలనే ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆయన అన్నారు.

‘‘సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటర్ల రాజకీయ అభిప్రాయాలను విశ్లేషించి, ప్రతిపక్ష మద్దతుదారుల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 వేల నుంచి 50 వేల వరకు ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి సీనియర్ నాయకులు, పలువురు పోటీదారుల పేర్లను కూడా అనుమానాస్పద జాబితాలో పెట్టారు. 2 వేల నుంచి 10 వేల ఓట్ల తేడాతో గెలుపోటములు తేలే నియోజకవర్గాల్లో ఈ తరహా కుట్రలు ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీస్తున్నాయి’’ అని భట్టి విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేవలం ఉచితాలుగా చూడటం సరికాదని ఆయన అన్నారు. ‘‘ఇవి మానవ వనరుల వికాసానికి, జీఎస్‌డీపీ పెరగడానికి పెట్టుబడులు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కారణంగానే నేడు హైదరాబాద్‌లో అత్యుత్తమ మానవ వనరులు అందుబాటులోకి వచ్చాయి’’ అని వివరించారు.

గతంలో కాంగ్రెస్‌ను వీడిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ, శరద్ పవార్ సహా పాత నాయకులందరూ తిరిగి పార్టీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో అన్ని వర్గాలను, మతాలను సమైక్యంగా ఉంచి అభివృద్ధి పథంలో నడిపించే విజన్ ఒక్క కాంగ్రెస్‌కే ఉందని భట్టి అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరూ కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి, దళిత నాయకత్వంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, కాంగ్రెస్‌లో పనిచేసే నాయకులను కులం ప్రాతిపదికన తాను చూడనని, పార్టీ అధిష్ఠానం ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించి తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారని చెప్పారు.

Next Story