వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై భట్టి సమీక్ష

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు వచ్చే మూడేళ్లలో శాశ్వత భవనాలు నిర్మించేందుకు పంచాయతీరాజ్ శాఖ త్వరగా వివరణాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తే, అందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

పంచాయతీరాజ్, ఉపాధి-శిక్షణ, పర్యాటక, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలు సమర్పించిన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై మంగళవారం సచివాలయంలో ఆయన విస్తృత సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, గడ్డం వివేక్ తమ శాఖల వివరాలు సమర్పించారు.

అందుబాటులో ఉన్న స్థలాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను కలిపి నిర్మించే అవకాశాలను అధ్యయనం చేయాలని భట్టి అధికారులకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన బోధనా విధానాలు అమలు చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో రహదారులపై యాచక వృత్తి చేస్తున్న చిన్నారులను శిశు విహార్‌కు పంపి, వారి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, అక్కడ ఆధునిక వంటశాల నిర్మాణం చేపట్టాలని సూచించారు.

ఉపాధి శిక్షణ శాఖ విషయంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులు నిర్వహించాలని ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్‌లో ఒప్పందాలు కుదిరిన కంపెనీలతో సంప్రదింపులు జరిపి, క్యూర్, ప్యూర్, రేర్ పాలసీకి అనుగుణంగా కోర్సులు రూపొందించాలని, ఈ సెంటర్లను స్కిల్స్ యూనివర్సిటీతో అనుసంధానం చేయాలని సూచించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు గిరిజన ఏజెన్సీల ద్వారానే జరగాలని, ఐటీడీఏలు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసి, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.

రెవెన్యూ శాఖ విషయంలో భూముల రీ-సర్వే కోసం అత్యాధునిక రోవర్ల కొనుగోలుకు 2026-27 బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రస్తుతం మండలానికి ఒకటి చొప్పున 460 రోవర్లు ఉన్నాయని, మరో 400 రోవర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. నక్షా లేని 373 గ్రామాల్లో త్వరలో రీ-సర్వే చేపడతామన్నారు. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

పర్యాటక శాఖను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, టైగర్ రిజర్వ్ జోన్లు, ఎకో-టూరిజం ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

ఈ సమీక్షలో వివిధ శాఖల అభివృద్ధి ప్రతిపాదనలు, సంక్షేమ కార్యక్రమాలు, నిధుల కేటాయింపులపై లోతైన చర్చ జరిగింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇటువంటి సమీక్షలు కీలకంగా మారాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story