భాజపా తీవ్ర వ్యతిరేకత

MLA Palvai Harish Babu: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చట్ట సవరణ బిల్లు ప్రజల హితానికి పూర్తిగా వ్యతిరేకమని, దీన్ని భారతీయ జనతా పార్టీ (భాజపా) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పార్టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పేరుతో అధికారాల కేంద్రీకరణ చేపట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, బదులుగా అనేక ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన అన్నారు.

తెలంగాణ శాసనసభలో శుక్రవారం జరిగిన చర్చలో పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ, ‘‘గతంలో వైఎస్ హయాంలో 12 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేశారు. అప్పుడు ప్రజలకు ఏ మేలు జరిగింది? ఇప్పుడు మరో 27 మున్సిపాలిటీలను చేర్చి 2 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒకే పరిపాలనా యూనిట్‌గా మార్చడం సరికాదు. దిల్లీ వంటి నగరాలు విడిపోతుంటే, ఇక్కడ కేంద్రీకరణ ఎందుకు? ఇంకా ఆ ప్రాంతాల్లో వ్యవసాయం జరుగుతోంది. ఈ విలీనంతో సేద్యం అంతరించే ప్రమాదం ఉంది. ఇది ఏ పార్టీకి లాభం చేకూర్చే పొలిటికల్ డీల్‌లా కనిపిస్తోంది’’ అని విమర్శించారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయని, వాటికి పేర్లు ఏమిటి? ఎలా విభజిస్తారు? అనే వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సీపీఐ సభ్యుడు కూనంనేని సమ్మక్క మాట్లాడుతూ, హైదరాబాద్‌ను మహానగరంగా మార్చే క్రెడిట్ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు ప్రమాదకరమవుతుందని హెచ్చరించారు. ‘‘ఇక్కడి రోడ్లు దారుణంగా ఉన్నాయి. అరగంట వర్షం పడితే ట్రాఫిక్ స్తంభించిపోతోంది. నగర విస్తరణపై సంతోషం ఉన్నప్పటికీ, భవిష్యత్తు ఆందోళన కలిగిస్తోంది’’ అని అన్నారు.

కాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి ‘రైజింగ్’ పేరుతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని, ఓఆర్‌ఆర్ బయట ఉన్న కొన్ని గ్రామాలను కూడా జీహెచ్‌ఎంసీలో చేర్చాలని సూచించారు.

భాజపా సభ్యుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, విస్తరణ వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధి హామీ పథకం పనులు కోల్పోతారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story