Telangana Politics : పోటా పోటీగా అన్నా… చెల్లెళ్ళ రాజకీయ కార్యక్రమాలు
కొంపల్లెలో జాగృతి శిక్షణా తరగతులు… ఉప్పల్‌లో బీఆర్‌ఎస్‌వీ సదస్సు

భారతీయ రాష్ట్ర సమితి పార్టీలో అగ్రనేతల మధ్య అంతర్గత విభేదాలు శృతి మించి రాగాన పడుతున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత కొంత కాలంగా పార్టీకి కొరకరాని కొయ్యలా తయారయ్యింది. బీఆర్ఎస్ ఎడ్డెమంటే కవిత తెడ్డమంటూ కేసీఆర్, కేటీఆర్ లకు కంట్లో నలుసులా మారింది. పై పెచ్చు తెలంగాణ జాగృతి అనే సంస్కృతి వారధిని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చు ప్రయత్నాలను కవిత మొదలు పెట్టింది. ఈ క్రమంలో తొలి అడుగుగా జాగృతికి అనుబంధంగా సింగరేణి కార్మిక సంఘాన్ని ప్రారంభించింది. జాగృతి తరపున బీసీ రిజర్వేషన్లపై ఉద్యమ కార్యాచరణను కూడా రూపొందించింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జాగృతి కార్యకర్తలకు నాయకత్వం లక్షణాలు పెంపొందించు కోవడానికి శిక్షణా తరగతులు నిర్వహింస్తోంది. శనివారం జూలై 26వ తేదీన కొంపల్లిలో ఉన్న శ్రీకన్వెన్షన్‌లో రెండు సెషన్లుగా రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించడానికి కవిత అన్ని ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ పేరుతో ఎమ్మెల్సీ కవిత నిర్వహిస్తున్న నాయకత్వ శిక్షణ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి జాగృతి కార్యకర్తలు హాజరవుతున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకూ ప్రజా ప్రతినిధుల విధులు, బాధ్యతలు, హక్కులపై జాగృతి కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కవిత ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెపుతున్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో పలువురు ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను ప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో పంచుకోనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ జాగృతి వివిధ విభాగాల బాధ్యులలో ఎంపిక చేసిన ప్రతినిధులకు ఈకార్యక్రమంలో నాయకత్వ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కవిత భావిస్తున్నారు. ఆగస్టు నెల నుంచి ప్రతి నెల ఉమ్మడి పది జిల్లాల వారీగా లీడర్ నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహించడానికి ఆమె కార్యచరణ రూపొందించుకున్నారు.
అయితే ఇదే రోజు ఉప్పల్ లోని మల్లాపూర్‌లో ఉన్న వీఎన్‌ఆర్ గార్డెన్స్ లో భారతీయ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యకర్తల సదస్సు జరపాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ సదస్సుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితులు హాజరై బీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలకు వర్తమాన రాజకీయాలపై అవగాహన కల్పించనున్నారు. ఇలా ఒకే రోజు అన్నా చెల్లెలు ఇద్దరూ కార్యకర్తలతో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం యాధృశ్చికమా లేక పోటా పోటీగా నిర్వహిస్తున్నారా అనేది అర్ధం కాక సగటు బీఆర్‌ఎస్ కార్యకర్త సతమతమైపోతున్నాడు. బీఆర్‌ఎస్ కు సమాంతరంగా కల్వకుంట్ల కవిత సొంతగా ఒక రాజకీయ శక్తిని తయారు చేసుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి బయకు వచ్చిన దగ్గర నుంచి బీఆర్‌ఎస్ కు కవితకు గ్యాప్ ఏర్పడింది. 2023లో పార్టీ ఓటమికి తానే కారణమన్నట్లు కొందరు బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించడం… వారి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ లు ఖండించకపోవడంపై కవిత మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయంపై కవిత తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ లీకై బీఆర్ఎస్ శ్రేణులను పెద్ద షాక్ కి గురిచేసింది. ఆ లేఖలో ఆమో బీఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడం బీఆర్‌ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ జాగృతికి నాయకత్వం పెంచుకోవడానికి కవిత చేస్తున్న ప్రయత్నాలు బీఆర్‌ఎస్ పార్టీకి తలనొప్పులు తెస్తున్నాయి.
