కవితకు దూరమవుతున్న బీఆర్ఎస్ యంత్రాంగం

కల్వకుంట్ల కవిత… బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గారాల పట్టి. ఒకప్పుడు యావత్ బీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు మొత్తం ఆమె అడుగులకు మడుగులొత్తే వారు. కవిత ఏదైనా కార్యక్రమానికి ఒక్క పిలుపు ఇస్తే కాకలు తీరిన బీఆర్‌ఎస్ నాయకులు కూడా క్యూలు కట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్ధితులు వెనకటిలా లేవు. కవిత కనిపిస్తే ఆమడ దూరం పారిపోతున్నారు. ఇక ఆమె ఏ కార్యక్రమం చేసినా జాగృతి సైన్యం తప్ప గులాబీ సైన్యం ఎక్కడా కానరావడం లేదు. పార్టీ అగ్రనాయకత్వం కూడా కవిత పట్ల శీతకన్ను ప్రదర్శిస్తోందనే ప్రచారం జరుగుతోంది. కవిత ను పార్టీలో ఎవరూ దరి చేరనివ్వడం లేదు. పరిస్ధితి చూస్తే ఆమెను ఒంటరి చేసినట్లే కనపడుతోంది. ఈ నెల 4వ తేదీన ఇందిరాపార్కువద్ద మహా ధర్నా తలపెట్టారు కవిత. అది కూడా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని ఆమె ధర్నాకు కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ ధర్నా కార్యక్రమం తెలంగాణ జాగృతి సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అంతే ధర్నాలో ఒక్క బీఆర్‌ఎస్ నేత కనిపించలేదు. అంతకు ముందు కవిత ప్రోగ్రామ్ అంటే బీఆర్‌ఎస్ ముఖ్య నేతలందరి హాజరు ఉండేది.
కానీ ఇప్పుడు సీన్ మారింది. కవిత పార్టీ వ్యవహారాలపై కేసీఆర్ కి లేఖ రాయడం అందులో బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్ధరణగా ప్రస్తావించడం, అ లేఖ మీడియాకు లీకు అవడం తో పార్టీకి అది సెట్ బ్యాక్ లా అయ్యింది. దానికి తోడు ఆమె అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఎయిర్ పోర్ట్ లోనే మీడియాతో మాట్లాడుతూ ఆ లేఖ తానే రాసానని ఎండార్స్ చెయ్యడమ కాంకుడా మర్నాడు విలేకరులను ఇంటికి పిలిపించుకుని కేసీఆర్ మంచోడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం… ఈ మెత్తం ఎపిసోడ్ కవితని కేసీఆర్‌కు, కేటీఆర్ కు దూరం చేసింది. యథా రాజా యథా ప్రజా అన్నట్లు కేసీఆర్, కేటీఆర్ లే కవితను దూరం పెట్టినట్లు సంకేతాలు ఇస్తుంటే ఇక పార్టీ నేతలు కూడా కవితను పట్టించుకోవడం మానేసారు. ఇదంతా ఒకెత్తైతే నిన్న బుధవారం కవిత తన భర్తను తీసుకుని కేసీఆర్ ని కలవడానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళితే ఆమెను పైకి కూడా రానివ్వకుండా కింద హాల్ లోనే కూర్చోబెట్టారనే ప్రచారం కూడా జరిగింది.
అయితే కవిత కూడా తాను ఒంటరిగానే ప్రయాణం చేసేందుకు సిద్ధపడుతున్నట్లు కనపడుతుంది. తెలంగాణ జాగృతి సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు తనకు కేసీఆర్ ఒక్కరే నాయకుడని చెప్పడం, జాగృతి తరుపున అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుంటూ వెళుతుండటం బీఆర్‌ఎస్ కు కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా తన సోదరుడు కేటీఆర్ పై ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలతో కుటుంబానికి కూడా ఆమె దూరమయినట్లే కనిపిస్తోంది. ఆమె తన సోదరుడికి దూరం కావాలనే ఈ కామెంట్స్ చేశారు. దీంతో తెలంగాణ జాగృతి నిర్వహించే కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు ఎవరూ హాజరు కావద్దంటూ అధినాయకత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. అందుకే కవిత ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన ధర్నాకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ అటు వైపు వెళ్ళలేదు. బీఆర్ఎస్ లో ఉన్న మహిళా నాయకులు, మాజీ మంత్రులు కూడా రాకపోవడంతో కారు పార్టీ నేతలు కవితకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేటీఆర్ తో పాటు కేసీఆర్ ఆదేశాలతోనే కవిత కార్యక్రమానికి నేతలు ఎవరూ హాజరు కాలేదని తెలిసింది. దీన్ని బట్టి చూస్తుంటే కవితకు కారు పార్టీ నుంచి సహకారం ఇక భవిష్యత్ లోనూ అందే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో ఆమెను బీఆర్ఎస్ లో ఒంటరి చేసే ప్రయత్నాలు ఒక క్రమ పద్దతిలో మొదలైనట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మరి రానున్న కాలంలో అన్నాచెల్లెళ్ల మధ్య వైరం ఏ స్థాయికి వెళుతుందన్నది చూడాలి.
