పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం!

BRS Government: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకొని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పాలమూరు ప్రాజెక్టు పనులను నెమ్మదిగా చేయాలనే మౌఖిక ఆదేశాలు వచ్చాయని, కాళేశ్వరానికి మాత్రమే వేగవంతమైన నిర్ణయాలు, నిధులు కేటాయించారని విమర్శలు గుప్పెత్తుతున్నాయి.

2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.89,794.71 కోట్లు భారీగా ఖర్చు పెట్టగా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేవలం రూ.27,513 కోట్లు మాత్రమే కేటాయించారు. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్), టెక్నికల్ వాల్యుయేషన్ రిపోర్టు (టీవీఆర్), పబ్లిక్ హియరింగ్, పర్యావరణ అనుమతులు వంటి కీలక దశల్లో కాళేశ్వరానికి ప్రాధాన్యత ఇచ్చి వేగంగా ముందుకు తీసుకెళ్లగా, పాలమూరు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం 98,570 ఎకరాలకు మాత్రమే నీటి సాగు అందగా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీటి చుక్క రాలేదు. ఈ నిర్లక్ష్యం వల్ల పాలమూరు ప్రాంత రైతులు తీవ్ర నష్టపోయారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ నిధులు కేటాయించడం వెనుక కమీషన్ల ఆశలు, రాజకీయ లబ్ధి ఉన్నాయని కొందరు విమర్శకులు అంటున్నారు. ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్‌కు కూడా పరోక్షంగా లాభం చేకూర్చేలా ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నేతల నుంచి ఇంకా స్పందన రాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటోందని సమాచారం.

PolitEnt Media

PolitEnt Media

Next Story