MLCs Tata Madhu and Naveen Reddy: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్

MLCs Tata Madhu and Naveen Reddy: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ (నిరోధక) అట్రాసిటీ చట్టం, బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
సోమవారం అసెంబ్లీ మాన్‌సూన్ సెషన్ ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు నల్ల టీ-షర్టులు ధరించి ప్రవేశించాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ తోపులాట సమయంలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్ ఓఎస్‌డి పోల్లెపల్లి వెంకటేశం ఫిర్యాదు చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం. 364/2026గా బీఎన్‌ఎస్ సెక్షన్ 352తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్లు 3(1)(ఆర్), 3(2)(వీఏ), 3(2)(vii) కింద కేసు నమోదైంది.
మంగళవారం ఉదయం 7 గంటలకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని నివాసం నుంచి తాతా మధును, కోకాపేట నివాసం నుంచి నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాతా మధును నారాయణగూడ పీఎస్‌కు తరలించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఆయనను నాంపల్లి అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నారు.
తాతా మధు మాత్రం తాను స్పీకర్‌పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, స్పీకర్ స్థానం పట్ల తనకు అపార గౌరవం ఉందని స్పష్టం చేశారు. పోలీసులు తనను, ఇతర బీఆర్ఎస్ ప్రతినిధులను దురుసుగా ప్రవర్తించినందుకు మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశానని, కాంగ్రెస్ తన మాటలను వక్రీకరిస్తోందని ఆయన అన్నారు.
ఈ అరెస్టులపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టులను కోర్టు ధిక్కరణగా అభివర్ణించి, అక్రమ కేసులతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హరీష్ రావు, ఇతర నేతలు కూడా ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతలు విడుదల కోరుతూ నిరసన తెలిపారు.
మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద జరిగిన తోపులాటలో పోలీసులపై దాడి, విధులకు ఆటంకం కలిగించినట్లు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, సుధీర్ రెడ్డి సహా 14 మంది బీఆర్ఎస్ నేతలపై కూడా బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును వెంటనే శాసనమండలి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పరిణామాలతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది.

