Ministers Ponnam and Vakiti: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై భారాస పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం సరిగా జీవోలు ఇవ్వకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని వారు స్పష్టం చేశారు. లొసుగులు లేకుండా సరైన విధానంలో ఉత్తర్వులు జారీ చేసి ఉంటే ఈ సమస్య రావలసిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

సోమవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రులు, భారాస ప్రభుత్వం ఇచ్చిన లోపభూయిష్టమైన జీవోల కారణంగానే హైకోర్టు ఈ పథకాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను ఆపేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వీటిని తొలగించాలన్న ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మధ్యంతర ఉత్తర్వులపై డివిజనల్ బెంచ్‌లో అప్పీలు చేస్తాం. పిటిషన్ దాఖలైన తర్వాత కౌంటర్ దాఖలు చేయడంలో అధికారుల లోపమా? లేక న్యాయపరమైన అంశాలు చూసేవారిదా? అనేది విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ కేసు విచారణకు ప్రత్యేక న్యాయవాదిని కూడా నియమిస్తాం” అని అన్నారు. ఇప్పటి వరకు ఈ పథకాల కింద 16.78 లక్షల మంది లబ్ధిదారులకు రూ.16,375 కోట్ల నిధులు అందించామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత సహాయాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తామని కూడా తెలిపారు.

అదే సమావేశంలో ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని పొన్నం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, కుల సంఘాలు పాల్గొనాలని ఆయన కోరారు.

మరోవైపు ఆటో కార్మికుల సమస్యలపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ విద్యుత్ ఆటోలను నడుపుతుందనేది దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆటో ఛార్జీల పెంపుపై ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని, ప్రయాణికులపై అదనపు భారం పడకుండా చూస్తామని ఆయన అన్నారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు రూ.లక్షన్నర ఆర్థిక సాయం అందించాలని మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story