Mahesh Kumar Goud: సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్‌పై జరుగుతున్న ఎస్‌ఐఆర్ ఆందోళనలో బీఆర్ఎస్ నేతలు మౌనం వహిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్రంగా విమర్శించారు. సీఈసీ తప్పిదాలు చేస్తున్నా హరీశ్‌రావు, కేటీఆర్ ఎందుకు నోరు తెరవడం లేదని, నిరసన కార్యక్రమాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య (లోపాయికారి) ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ-ఫార్ములా కేసులో అరెస్ట్, కాళేశ్వరం కేసులో సీబీఐ అరెస్ట్ అవుతామనే భయం ఉందా అని నిలదీశారు. ఉండటానికి ఇల్లు లేదని చెప్పిన కేటీఆర్‌కు ఫైవ్‌స్టార్ హోటళ్లు, వేలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా బీజేపీ, మిత్రపక్షాలు తప్ప మిగతా అన్ని పార్టీలు రోడ్లెక్కాయని మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో దళితులు, మైనారిటీలు, గిరిజనుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లో రోహింగ్యాల పేరుతో మమతా బెనర్జీని, బిహార్‌లో ఆర్జేడీని గెలవకుండా ఆపే ప్రయత్నం జరిగిందన్నారు. వయసు పట్టించుకోకుండా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ పోరాటం చేస్తున్నారని తెలిపారు. జ్ఞానేశ్వర్ కుమార్‌ను తొలగించే వరకు నిరసన ర్యాలీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలనుకుంటే 2009లోనే అయ్యేవారని, శాశ్వత అధికారం కోసం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను తొలగించి జ్ఞానేశ్వర్ కుమార్ లాంటి తొత్తులను సీఈసీగా నియమించుకుందని బీజేపీపై విరుచుకుపడ్డారు.

నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై కూడా మహేశ్‌కుమార్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వాస్తవాలు తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడినదానిలో నిజం లేదని, ఎస్‌ఐఆర్ అంశంపై మొదట స్పందించింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. అర్హులైన ఓట్లు కాపాడటమే తమ లక్ష్యమని, పార్టీలతో నిమిత్తం లేకుండా ఓట్ల రక్షణే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్‌పై గౌరవం ఉందని, సామాజిక అంశాలపై ఆయన స్పందిస్తారని కూడా పేర్కొన్నారు.

Next Story