Deputy CM Bhatti Vikramarka: బుద్ధుడు, అంబేడ్కర్ ఆలోచనలే సమస్యలకు శాశ్వత పరిష్కారం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka: బుద్ధుడు, డా. బి.ఆర్. అంబేడ్కర్‌ల ఆలోచనలు అన్ని సమస్యలకు సమగ్ర పరిష్కార మార్గాలను చూపుతాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వీరి దార్శనికత, సామాజిక న్యాయం, సమానత్వం, శాంతి ఆశయాల మార్గంలోనే తెలంగాణ ప్రభుత్వం పాలన సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
‘3వ దమ్మ పాదయాత్ర’లో భాగంగా థాయ్‌లాండ్, భారతీయ బౌద్ధ భిక్షువుల బృందం కర్ణాటకలోని కలబురిగి నుంచి నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం వరకు పాదయాత్ర చేపట్టింది. ఈ యాత్ర మార్చి 1న బుద్ధవనానికి చేరనుంది. బుధవారం ఈ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. నెక్లెస్ రోడ్డులోని అంబేడ్కర్ స్మృతివనంలోని సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భిక్షువులతో కలిసి పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, బుద్ధవనం ప్రాజెక్ట్ ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య, గగన్ మాలిక్ ఫౌండేషన్ నిర్వాహకుడు, సినీ నటుడు గగన్ మాలిక్, బౌద్ధ భిక్షువులు వినయ రక్షిత, అజాన్ టాన్, బుద్ధపాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం భిక్షువుల బృందం హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడి విగ్రహాన్ని దర్శించుకుని ప్రార్థనలు చేశారు. గగన్ మాలిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్ర విశ్వశాంతి, సామరస్యాన్ని ప్రోత్సహిస్తోందని అందరూ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, సీనియర్ సంపాదకుడు రామచంద్రమూర్తి, కోదండరాం వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు.

