CM Revanth Reddy: మెట్రో రద్దీ తగ్గించేందుకు కొత్త కోచ్‌లు కొనండి.. పాతబస్తీ పనులకు వేగం పెంచండి: సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు బోగీలను జతచేసేందుకు కొత్త కోచ్‌లు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు.
మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత రైళ్లకు అదనపు కోచ్‌లు జోడించి రద్దీని నియంత్రించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగమైన పాతబస్తీ కారిడార్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఈ కారిడార్‌లో మెట్రో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. దిల్లీ మెట్రో అధికారులను సంప్రదించి తాజా సాంకేతిక పరిజ్ఞానం, సలహాలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.
ఇదే సమావేశంలో డిసెంబరులో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్’ ఏర్పాట్లపై కూడా సీఎం సమీక్షించారు. వ్యాపార రంగంలోని వివిధ సెక్టార్లకు చెందిన ప్రముఖులను సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో సమిట్ నిర్వహించాలని సూచించారు. గత ఏడాది సదస్సు ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతి వివరాలను సమగ్రంగా నివేదించాలని, మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు కె. రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- RevanthReddyHyderabadMetroHyderabadMetroRailMetroCoachesMetroRushMetroCrowdingOldCityMetroMGBSChandrayanguttaHyderabadTelanganaTelanganaNewsHyderabadNewsMetroPhase2MetroExpansionUrbanTransportPublicTransportInfrastructureDevelopmentOldCityDevelopmentTelanganaGovernmentCMRevanthReddyLatestHyderabadNewsLatestTelanganaNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

