కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సంచలన వ్యాఖ్యలు

Kaleshwaram Project: కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.లక్ష కోట్లకుపైగా నీళ్లలో కొట్టుకుపోయాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ స్పష్టం చేశారు. సోమవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితి, జాతీయ హోదా కల్పనపై భాజపా సభ్యులు కె.లక్ష్మణ్‌, బీఆర్‌ఎస్‌ సభ్యులు కేఆర్‌ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. ‘‘ప్రాజెక్టుపై రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎప్రైజల్‌ కోసం మా శాఖ వద్దకు వచ్చింది. ఆ తర్వాత కూడా కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదు. మా పరిధి సాంకేతిక మదింపు వరకే కావడంతో అంతవరకు మదింపు చేసి పంపాము’’ అని పాటిల్‌ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లకు మించి ఖర్చు చేసిన విషయం దేశానికంతా తెలుసని, ఆ నిధులన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రాజెక్టుపై విచారణ కూడా జరుగుతోందని చెప్పారు. ప్రాజెక్టును పునరుద్ధరించి ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే, దీనిపై అధ్యయనం చేస్తున్న ఏజెన్సీల పని నిదానంగా సాగుతోందని, దానివల్ల ప్రజలకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఇంకా అందకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యల సమయంలో పక్కనే కూర్చున్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ‘షేమ్‌.. షేమ్‌’ అని వ్యాఖ్యానించారు.

కాగ్‌ నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన అంశం రాష్ట్ర పరిధిలోనిదని సీఆర్‌ పాటిల్‌ స్పష్టం చేశారు. ఆ నివేదిక తమ వద్దకు రాలేదని, తాము స్పందించలేమన్నారు. ‘‘రూ.1.47 లక్షల కోట్ల విలువైన కాళేశ్వరం ఆర్థికంగా ప్రయోజనకరం కాదని, వాస్తవ అంచనా విలువ కంటే 80 శాతం ఎక్కువ చేశారని కాగ్‌ చెప్పిన అంశంపై ఏం చర్యలు తీసుకున్నారు?’’ అని లక్ష్మణ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఇలా ప్రకటించారు.

అంతకుముందు పీఎంకేఎస్‌వై (ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన) కింద తెలంగాణకు ఇచ్చిన నిధుల గురించి లక్ష్మణ్‌ ప్రశ్నించారు. తెలంగాణ నుంచి పీఎంకేఎస్‌వై-ఏఐబీపీ కింద చేర్చిన 11 ప్రాజెక్టులకు రూ.1,129.80 కోట్ల సాయం పొందే అర్హత ఉండగా, ఇంతవరకు రూ.981 కోట్లు అందించినట్లు మంత్రి తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story