Father Colombo Medical College : ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్‌పై సీబీఐ కేసు నమోదు
మెడికల్ కళాశాలల తనిఖీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ

మెడికల్ కళాశాలల తనిఖీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ కొమిరెడ్డి జోసఫ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాలు తీసుకున్నారని నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో 36 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. కర్నాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో ఉన్న మెడికల్ కలేజీల తనిఖీల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన డాక్టర్లు అక్రమాలకు పాల్పడ్డట్లు సీబీఐ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారానికి చత్తీస్గడ్ కు చెందిన శ్రీ రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజ్ డాక్టర్లు బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు సీబీఐ తేల్చింది. మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లుగా కొమిరెడ్డి జోసఫ్ పై సీబీఐ ఆరోపణలు మోపింది. విశాఖ గాయత్రి మెడిక్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షలు వసూలు చేసి డాక్టర్ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు సీబీఐ కనుగొంది. మెడికల్ కాలేజీల మధ్యవర్తిత్వానికి కొమిరెడ్డికి రెండు దఫాలుగా మొత్తం ఆరవై లక్షలు బ్రోకలర్ల ద్వారా ముట్టచెప్పినట్లు సీబీఐ తేల్చింది. దక్షిణాది రాష్ట్రాల మెడికల్ కాలేజీల తనిఖీ కోసం నియమించిన డాక్టర్ వీరేంద్రకుమార్, కదిరికి చెందిన డాక్టర్ హరిప్రసాద్, హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖకు చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్లుకు కూడా ఈ స్కామ్ లో సంబంధాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించిది.
