తీవ్ర ఆర్థిక వివక్ష చూపుతోంది: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Minister Tummala Nageswara Rao: కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంపై తీవ్రమైన వివక్ష చూపుతూ దగా చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రం పంపిన ప్రతిపాదనల్లో ఒక్కటి కూడా పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు.

రాష్ట్రం నుంచి వివిధ పన్నుల రూపంలో రూ.1,33,208 కోట్లు కేంద్ర ఖజానాకు వెళ్తున్నాయని, అయితే అన్ని కేంద్ర పథకాలతో కలిపి కేవలం రూ.51 వేల కోట్లు మాత్రమే తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయని తుమ్మల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు భరోసా, పంట కొనుగోళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్‌ వంటి అనేక పథకాలపై భారీగా ఖర్చు చేస్తోందని, ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన వాటా రాకపోవడం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా కోసం కేంద్రంతో పోరాటం చేయడంలో తమతో కలిసి ఉండాలని ఆయన కోరారు.

కేంద్ర వ్యూహం రాష్ట్రాలను బలహీనపరచడమే

జీఎస్టీ సవరణల వల్ల రాష్ట్రం ఏటా సుమారు రూ.8 వేల కోట్లు నష్టపోతోందని, రంగాల వారీగా ప్రత్యేక గ్రాంట్లకు కోత పెట్టడం వల్ల మరో రూ.5 వేల కోట్ల వరకు నష్టం రావచ్చని మంత్రి పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం సూచించిన రెవెన్యూ లోటు గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా తొలగించడంతో రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్ర్యం దెబ్బతింటోందని విమర్శించారు. బలమైన రాష్ట్రాలను బలహీనపరిచి, ఆర్థికంగా కేంద్రంపై ఆధారపడేలా చేయాలనే రాజకీయ వ్యూహం ఇందులో ఉందని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగినప్పుడే దేశ సమగ్రాభివృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని గుర్తు చేశారు.

బీజేపీ నేతలు అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించరు?

తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు గత పదేళ్లలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎన్నడూ ప్రశ్నించలేదని తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాకు కేంద్రమే పూర్తి నిధులు ఇస్తోందన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణ ఖర్చును రాష్ట్రానికి విడుదల చేసిన నిధులుగా చూపిస్తూ బీజేపీ నేతలు గొప్పలు చెబుతున్నారని, కానీ ఆ ఖర్చును టోల్ ఛార్జీల రూపంలో ప్రజల నుంచే తిరిగి వసూలు చేస్తారనే వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ వివక్ష దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న రాజకీయ దురుద్దేశపూరిత వైఖరికి అద్దం పడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story