Ponguleti Srinivas Reddy: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ)లో క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపేలా విధివిధానాలను రూపొందిస్తామని వెల్లడించారు.


సచివాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. ‘‘కొన్ని ప్రాంతాల్లో ఎస్‌ఓపీ సక్రమంగా అమలు జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భిన్నమైన పద్ధతులను అనుసరిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. క్షేత్రస్థాయి అధికారుల అనుభవాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ఎస్‌ఓపీలో మార్పులు చేస్తాం’’ అని చెప్పారు.


కలెక్టర్లు రీసర్వేను నిరంతరం పర్యవేక్షించాలని, రీసర్వే పూర్తయ్యాక అభ్యంతరాలు తెలిపే అవకాశాలపై భూ యజమానులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. నోటీసులు జారీ చేశాక ప్రతి 15 రోజులకోసారి గ్రామాల్లో చాటింపు వేయించాలని సూచించారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. నిజామాబాద్‌లో పనితీరు సరిచేసుకుని వేగవంతం చేయాలని చెప్పారు.


పాలేరు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా 141 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 708 రోవర్లతో సర్వే కొనసాగుతోందని, మరో 400 రోవర్లను వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఇందిరమ్మ టవర్స్‌కు భూములు గుర్తించాలని, రెండు పడక గదుల ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులను తక్షణమే గుర్తించి కేటాయించాలని దిశానిర్దేశం చేశారు.

Next Story