Clarity on GO 22A Issue: 22ఏ సమస్యపై స్పష్టత.. నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
ప్రకటన

Clarity on GO 22A Issue: నిషేధిత భూముల (22ఏ) జాబితా అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. బుధవారం (సెప్టెంబర్ 16) శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఈ అంశంపై స్పష్టత ఇవ్వనున్నారు. యూఎల్‌సీ భూముల్లో నిర్మించిన అపార్ట్‌మెంట్ల సమస్యలు, సామాన్యులకు ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ హాజరయ్యారు. ఈ సమావేశంలో 22ఏ భూములపై నెలకొన్న ఆరోపణలు, అపోహలు, ప్రతిపక్షాల విమర్శలపై చర్చించి.. సభలో నిజాలను వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించనున్నది. అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించనున్నారు. సొంత స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుని ఐదేళ్లు గడిచిన యజమానులకు పూర్తి హక్కులు కల్పించేలా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికల నేపథ్యంలో చట్టపరమైన చర్యలపైనా దృష్టి పెట్టనున్నారు.
రెవెన్యూ శాఖ కార్యదర్శి, అధికారులు, మంత్రి పొంగులేటితో కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. యూఎల్‌సీ భూముల్లో వ్యక్తిగత ఇళ్లకు మినహాయింపు ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని మంత్రి పొంగులేటి సూచించినట్లు సమాచారం.
గతంలో శాసనసభలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. భాజపా, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు, అధికార పక్ష శాసనసభ్యులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా నేడు సీఎం ప్రసంగించనున్నారు. భారాస పాలనలోనే 22ఏ జాబితాను అడ్డుపెట్టుకుని అక్రమాలు జరిగాయని, వాటిని ఆధారాలతో ప్రజల ముందుంచాలని ప్రభుత్వం భావిస్తోంది. నిషేధిత జాబితాతో సామాన్యులకు ఇబ్బందులు రాకుండా పరిష్కారం చూపేలా ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
శాసనసభ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం స్వల్పకాలిక చర్చల్లో 22ఏ అంశంపై సీఎం మాట్లాడనున్నారు.

