శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌, మాజీ సీఎం కేసీఆర్‌

Bathukamma Festival: తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలంతా పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఇద్దరు నేతలు ప్రకటనలు విడుదల చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు:

తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని ఉద్ఘాటించారు. ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని, ప్రకృతి మాతను స్మరించుకుంటూ ఆడపడుచులు కలిసి సమిష్టిగా చేసుకునే సాంస్కృతిక పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని, అందరూ సంతోషంగా, సామరస్యంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

కేసీఆర్ శుభాకాంక్షలు:

బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక ఐక్యతను చాటుతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ, పల్లెలు పట్టణాల్లో మహిళలు పిల్లాపాపలతో ప్రత్యేక సాంస్కృతిక సందడి నెలకొంటుందని చెప్పుకొచ్చారు. సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో, నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ ప్రధాన సాంస్కృతిక వేదికగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, తెలంగాణ మహిళల ప్రత్యేక పండుగగా గుర్తించి కానుకగా బతుకమ్మ చీరలు అందజేశామని గుర్తుచేశారు. కష్టాలనుంచి రక్షించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రకృతి మాత బతుకమ్మను కేసీఆర్ ప్రార్థించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story