Medaram: మేడారంలో 68 కిలోల బెల్లం సమర్పించి మొక్కు చెల్లించిన సీఎం రేవంత్
మొక్కు చెల్లించిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన మొక్కులను చెల్లించుకున్నారు. సీఎం రేవంత్ తులాభారం ద్వారా అమ్మవారికి 68 కిలోల బెల్లం (బంగారం) సమర్పించారు. తన బరువు 68 కిలోలుగా ఉండటంతో, అంతే బరువున్న బెల్లంను సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.
మేడారం ఆలయ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ స్వయంగా పరిశీలించారు. అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్‌ను ఆయన విడుదల చేయనున్నారు. సమ్మక్క, సారలమ్మ ఆలయ అభివృద్ధి కోసం రూ.236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తున్న నేపథ్యంలో సీఎం మేడారం సందర్శించారు. ఆలయ గద్దెల మార్పు, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన, జంపన్నవాగు సుందరీకరణ వంటి అంశాలపై మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో కలిసి పూజారులతో చర్చించారు.
Medaram: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో రూ.236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి, వందేళ్ల పాటు నిలిచేలా శాశ్వత పనులను చేపట్టేందుకు చర్యలు ప్రారంభించారు. అలాగే, వచ్చే ఏడాది జరిగే మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించేందుకు రూ.150 కోట్లను అదనంగా కేటాయించారు. ఈ నిధులతో సివిల్ మరియు నాన్-సివిల్ పనులను జాతర నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక వేశారు.
ఈ రూ.150 కోట్లలో రూ.90.87 కోట్లు సివిల్ వర్క్స్‌కు, రూ.59.13 కోట్లు నాన్-సివిల్ వర్క్స్‌కు కేటాయించారు.
