ప్రతి ఓటరినీ కలుస్తేనే భారీ మెజార్టీ

వారు బూత్‌లకు రావాల్సిందే.. మంత్రులారా చొరవ తీసుకోండి

ఈ మూడు రోజులు అతి కీలకం.. ఏమాత్రం ఏమరుపాటు వద్దు

ఇదే జోరును కొనసాగిస్తే గెలుపు ఖాయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష

మీనాక్షి, భట్టి, మహేశ్‌గౌడ్‌తో కలిసి వ్యూహరచన

CM Revanth: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందాలంటే ప్రతి ఓటరినీ నేరుగా కలిసి మాట్లాడాలని, ఓటింగ్ రోజున వారు తప్పకుండా పోలింగ్ బూత్‌లకు చేరేలా మంత్రులు, నాయకులు ప్రత్యేక చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రచార గడువు నవంబరు 9తో ముగియనుండటంతో.. మిగిలిన ఈ మూడు రోజులు అత్యంత కీలకమని, ఇప్పటి జోష్‌ను ఇన్కాస్త పెంచాలని స్పష్టం చేశారు. ఏ చిన్న ఏమరుపాటు కూడా ఉండరాదని హెచ్చరించారు.

గురువారం సీఎం ఎంపీ క్యాంప్ ఆఫీసులో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై విస్తృత సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సమక్షంలో ముందుగా మంత్రులందరితో సమిష్టిగా చర్చించారు. తర్వాత ఒక్కొక్క మంత్రితో విడివిడిగా మాట్లాడారు.

మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్ వెంకటస్వామి తదితరులు హాజరయ్యారు. ప్రచార సరళి, గెలుపు వ్యూహాలు, ప్రతిపక్షాల దుష్ప్రచారాలను ఎదుర్కొనే ప్రతివ్యూహాలు, డివిజన్లవారీగా సర్వే నివేదికలు, బూత్‌ల వారీగా ఓటర్ల స్థితిగతులు.. ఇలా అన్ని అంశాలపై లోతుగా చర్చించారు.

స్థానిక సమస్యలకు హామీ.. సామాజిక వర్గాలపై ఫోకస్

‘పోలింగ్ బూత్‌ల వారీగా ప్రభావితం చేయగల కీలక నాయకులను గుర్తించండి. ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించి.. వారి సమస్యలు పరిష్కరిస్తామని గట్టిగా హామీ ఇవ్వండి. కాలనీలు, బస్తీలు, మురికివాడలు, అపార్టుమెంట్ల వారీగా స్థానిక సమస్యలు తెలుసుకుని.. వాటికి తక్షణ పరిష్కారం హామీ ఇచ్చి మద్దతు సాధించండి.

ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి ఓటరినీ కలిసి ఓటు అభ్యర్థించండి. కాలనీ సంఘాలు, బస్తీ సంఘాలు, అపార్టుమెంట్ అసోసియేషన్లతో ప్రత్యేక భేటీలు ఏర్పాటు చేయండి. మంత్రులు తమకు అప్పగించిన డివిజన్లలో రోజుకు కనీసం 10 గంటలు ప్రచారంలో గడపాలి’ అని సీఎం రేవంత్ సూచించారు.

ప్రచారంలో ఉన్న మంత్రులు, విప్‌లు, నాయకులతో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలను గట్టిగా ఎదుర్కోవాలని, బీఆర్‌ఎస్, బీజేపీల ఫేక్ సర్వేలను తిప్పికొట్టాలని ఆదేశించారు.

బీఆర్‌ఎస్, బీజేపీని ఎండగట్టండి

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చండి. అదే సమయంలో.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో జూబ్లీహిల్స్‌లో ఏమీ చేయలేదని, కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు సహకరించడం లేదని ప్రజలకు వివరించండి. రెండు పార్టీలూ ఒక్కటేనని బూత్ స్థాయిలో బలంగా ప్రచారం చేయండి అని రేవంత్ రెడ్డి నిర్దేశించారు.

ఓటర్ల జాబితాలో లోపాలు, డూప్లికేట్ ఓట్లు, మారిన నివాసాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. పోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ సమీక్షతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపినట్లు తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story