CM Revanth Meets Analog AI CEO: అనలాగ్ ఏఐ సీఈవోతో సీఎం రేవంత్ భేటీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ , వరదల నిర్వహణకు ఏఐ సాంకేతికత సహకారం కోరిన సీఎం
హైదరాబాద్‌లో ట్రాఫిక్ , వరదల నిర్వహణకు ఏఐ సాంకేతికత సహకారం కోరిన సీఎం

CM Revanth Meets Analog AI CEO: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ప్రముఖ ఏఐ సంస్థ అనలాగ్ ఏఐ (Analog AI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెక్స్ కిప్‌మాన్ గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు, వర్షాల సమయంలో వచ్చే వరదల నియంత్రణకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతలను ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఈ భేటీలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రాజెక్టులు, మూసీ నదీ అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను అనలాగ్ ఏఐ సీఈవోకు వివరంగా తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో అనలాగ్ ఏఐ సంస్థ సాంకేతిక సహకారం అందించాలని ఆయన సూచించారు.
అంతేకాకుండా, డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు అలెక్స్ కిప్‌మాన్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సదస్సుకు హాజరై, తమ సంస్థ అనుభవాలను పంచుకోవాలని కోరారు.
ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏఐ రంగంలో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ భేటీ మరింత దోహదపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

