CM Revanth Reddy Assures: సీఎం రేవంత్ రెడ్డి: “ఎస్‌ఎల్‌బీసీ మా హయాంలోనే పూర్తి .. రైతుకు నీళ్లు గ్యారంటీ"! : రేవంత్‌రెడ్డి ధీమా
రైతుకు నీళ్లు గ్యారంటీ"! : రేవంత్‌రెడ్డి ధీమా

CM Revanth Reddy Assures: ఈ ప్రభుత్వ హయాంలోనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో రూ.23 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
‘‘పోరాటాల పౌరుషం ఉన్న గడ్డ నల్గొండ. నిజాం నిరంకుశ పాలనను ఎదురించిన జిల్లా నల్గొండ. ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం రద్దు చేసి సన్నబియ్యం ఇస్తున్నాం. పేదల ఆకలి తీర్చినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యం అని మన ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తోంది. దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. గుజరాత్ సహా దేశంలో మరే రాష్ట్రంలోనూ సన్న బియ్యం ఇవ్వట్లేదు. యూపీఏ ప్రభుత్వ హయాములో రాష్ట్రంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగింది. గత పదేళ్లలో ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 4.50లక్షల ఇళ్లు పేదలకు మంజూరు చేశాం. లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించిందే ఇందిరమ్మ ప్రభుత్వం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 25లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసింది. ఒకే విడతలో రూ.2లక్షల చొప్పున రూ.21వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశాం. రుణమాఫీ పేరిట పదేళ్లపాటు రైతులను కేసీఆర్ మోసం చేశారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ కలిసేవారు కాదు. ప్రగతి భవన్, ఫామ్‌హౌజ్‌లోకి ఎవ్వరినీ రానివ్వలేదు. కానీ, నిన్న ఇద్దరు సర్పంచ్‌లను కూర్చోబెట్టుకుని మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయని చెబుతున్నారు. కేసీఆర్ ఓడిపోయాకే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కేసీఆర్ పదేళ్లపాటు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వ హయాంలోనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఎస్‌ఎల్‌బీసీ పనులు ప్రారంభించగానే సొరంగంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. సొరంగంలో ప్రమాదం జరిగితే భారత రాష్ట్ర సమితి నేతలు సంబరపడ్డారు. ఏదేమైనా టన్నెల్‌ను పూర్తి చేసి నీరు అందిస్తాం’’ అని సీఎం అన్నారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు సభలో పాల్గొన్నారు.

