CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ నీటి కుట్రకు రాచబాట వేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా జలసమాధి చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల్లో మామ, అల్లుడు రాష్ట్రానికి మరణశాసనం రాశారని, తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేశారని ఆరోపించారు.

2005లో హరీశ్‌రావుతో సహా ఆరుగురు తెరాస నేతలు అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతోపాటు 2019లో శ్రీశైలంలో బురదనీటిని కూడా మళ్లించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం, 2022లో పల్నాడు నీటిమళ్లింపు పథకం.. ఇలా అన్నీ కేసీఆర్ హయాంలోనే జరిగాయని సీఎం తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తరలించే సామర్థ్యం రోజుకి 4.47 టీఎంసీల నుంచి 13.17 టీఎంసీలకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే పెంచారని మండిపడ్డారు. ఏపీకి శాశ్వతంగా 512 టీఎంసీలు ఇచ్చేలా అంగీకరించారని ఆయన ధ్వజమెత్తారు. గోదావరిలోనూ తీవ్ర అన్యాయం చేశారని, తుమ్మిడిహెట్టి నుంచి నిర్మాణ స్థలాన్ని మార్చి నష్టం కలిగించారని విమర్శించారు.

తెలంగాణకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే వైఎస్ జగన్ పల్నాడు వాటర్‌గ్రిడ్‌కు 2022 ఫిబ్రవరి 16న జీవో నం.56 విడుదల చేశారని సీఎం చెప్పారు. గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య విభాగం కింద 13 జిల్లాల్లో ఇంటింటికీ నల్లా, తాగునీటి సరఫరా కోసం రూ.17,989 కోట్ల ఖర్చుతో పాలన ఉత్తర్వులు వచ్చాయని, అందులోనే పల్నాడు ఏరియా ప్రాజెక్టుకు రూ.1200 కోట్ల అంచనాతో రూ.500 కోట్లు కేంద్రం మ్యాచింగ్ గ్రాంటు కింద పనులు పేర్కొన్నారని వివరించారు. నాడు ప్రగతిభవన్‌లో జగన్ విందు భోజనం చేసినప్పుడు ఈ జీవో వచ్చిందని, అప్పట్లో కేసీఆర్ జీవో అనుమతులను వ్యతిరేకించలేదు, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేయలేదు, పల్నాడు వాటర్ గ్రిడ్ స్కీమ్ పనులను అభ్యంతరపెట్టలేదని ఆయన పేర్కొన్నారు.

ప్రాజెక్టు పనులు ప్రస్తుత ప్రభుత్వ దృష్టికి వచ్చిన వెంటనే కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశామని, మంత్రి ఉత్తమ్ ఏపీ సీఎస్‌కు ఫోన్ చేసి రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న చర్చలకు భంగం వాటిల్లే అవకాశముందని చెప్పారని సీఎం తెలిపారు. అక్రమ నిర్మాణంపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. 2023-24లో కృష్ణా జలాల్లో ఏపీ 208.79 టీఎంసీలు, తెలంగాణ 119 టీఎంసీలు వాడుకుందని, 2024-25లో తెలంగాణ 285.17 టీఎంసీలు, 2025-26లో 268.17 టీఎంసీలు వినియోగించుకున్నామని వివరించారు. కరవుకాలంలో 2026-27లో ఇప్పటికే తెలంగాణ 110 టీఎంసీలు, ఏపీ 132 టీఎంసీలు వాడిందని, కేసీఆర్ ఒప్పందం ప్రకారం 66%-33% కాగా తెలంగాణ 45.44% వాడుకుందని ప్రభుత్వ పనితీరును ఆయన హైలైట్ చేశారు.

వైఎస్ హయాంలో హరీశ్‌రావు, సంతోష్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు తెరాస మంత్రులుగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచేందుకు అనుమతులిచ్చారని, హరీశ్‌రావు తన గురువైన వైఎస్‌కు గురుదక్షిణ చెల్లించుకున్నారని సీఎం విమర్శించారు. 2005-06 బడ్జెట్‌లోనే శ్రీశైలం కుడికాలువ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు గురించి ప్రస్తావించారని, 2005 సెప్టెంబరు 13న జీవో.170 వచ్చిందని ఆయన ఆధారాలు చూపారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడుతోందని, బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Next Story