సెంటిమెంట్‌ అస్త్రంతో మోసం చేసే ప్రయత్నం

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. విజయంపై ఆశలు లేకపోవడంతోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకులు సెంటిమెంట్‌ను ఆయుధంగా ఉపయోగించి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. షేక్‌పేట, యూసుఫ్‌గూడ డివిజన్లలో బుధవారం నిర్వహించిన రోడ్‌షోలు, ప్రచార సభల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు. అభివృద్ధి లేదని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని, అయితే ఓట్లు అడిగే ముందు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌లోని పీజేఆర్ విగ్రహాల ముందు కేసీఆర్, కేటీఆర్ ముక్కు నేలకు రాయాలని సూచించారు. కంటోన్మెంట్‌లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కేటీఆర్ సవాల్ విసిరారని, అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ రూ.5 వేల కోట్ల పనుల జీవోలు చూపించారని, ఆ సవాల్‌కు కేటీఆర్ బదులివ్వాలని డిమాండ్ చేశారు. మాదకద్రవ్యాల నియంత్రణపై అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత రక్త నమూనాలు ఇవ్వాలంటే కేటీఆర్ పారిపోయారని విమర్శించారు.

కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై తాను మాట్లాడితే, ఆరు గ్యారంటీలపై చర్చకు రావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరుతున్నారని రేవంత్ అన్నారు. దిల్లీకి వెళ్లి కాళేశ్వరం అవకతవకలపై ప్రధాని మోదీ, అమిత్ షాతో చర్చించి, కేసీఆర్, కేటీఆర్‌లను జైల్లో పెట్టించాలని కిషన్‌రెడ్డికి సూచించారు. భాజపా రాష్ట్రాన్ని పక్షపాత దృష్టితో చూస్తోందని ఆరోపించారు. గుజరాత్‌లో సబర్మతి నది అభివృద్ధి చెందినట్లు మూసీ నదిని అభివృద్ధి చేయకూడదా అని ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లకు నిధులు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని, గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు మరో నీతా అని నిలదీశారు. సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి రెండుసార్లు గెలిచినా తెలంగాణకు నిధులు తీసుకురాలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌తో భాజపా చీకటి ఒప్పందం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను అక్కున చేర్చుకుందని, క్రీడాకారులు సిరాజ్ వంటి వారికి మద్దతు ఇస్తోందని రేవంత్ తెలిపారు. కృష్ణానగర్‌లో సినీ కార్మికుల సంక్షేమం కోసం ఎంతైనా చేస్తామని, చిత్రపురి కాలనీ నిర్మించి వారిని ఆదుకున్నామని చెప్పారు. వారి పిల్లల కోసం కేజీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ తరహా పాఠశాల నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గద్దర్ పేరుతో అవార్డులు అందజేశామని, సినీ కార్మికుల గురించి కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడూ మాట్లాడలేదని ఆరోపించారు. ఉప ఎన్నిక రాగానే ముస్లింలపై బీఆర్‌ఎస్ నేతలు ప్రేమ చూపుతున్నారని, కానీ కాంగ్రెస్‌కు ముస్లింలంటే గౌరవమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా జరిగిన ఈ సభల్లో మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. టోలిచౌకి బృందావన్ కాలనీలో రాత్రి జరిగిన సభకు వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story