తెలంగాణ పోలీస్‌ శాఖలో అనేక సంస్కరణలు అమలు.. హైడ్రా, ఈగల్‌, టీజీసేఫ్‌తో ఫలితాలు


CM Revanth Reddy: దక్షిణాది రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయంతో నేరాలను పూర్తిగా అరికట్టవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో తెలంగాణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగిన దక్షిణ ప్రాంతీయ పోలీస్‌ సమన్వయ సమావేశం (సదరన్‌ రీజినల్‌ పోలీస్‌ కోఆర్డినేషన్‌ కమిటీ)కు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ డీజీపీలు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.సమాజానికి భద్రత, రక్షణ పునాదుల్లాంటివని సీఎం పేర్కొన్నారు. ప్రజలు సమర్థమైన, నిష్పక్షపాత పోలీసు వ్యవస్థను కోరుకుంటారని అన్నారు. తెలంగాణ పోలీస్‌ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు.

హైదరాబాద్‌ను నాలుగు కమిషనరేట్లుగా విభజించి అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు. నార్కోటిక్స్‌, సైబర్‌ నేరాల కట్టడికి కఠిన చర్యలు చేపట్టామని, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్‌ ఫోర్స్‌కు కేంద్ర అవార్డులు లభించాయని గుర్తు చేశారు. ఆహార కల్తీ నివారణకు టీజీ సేఫ్‌, ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా ఏర్పాటు చేశామని తెలిపారు.పోలీస్‌ సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, వారి పిల్లల కోసం యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు.

పోలీసు శాఖపై పెట్టే ఖర్చును పౌరుల భద్రతకు పెట్టుబడిగా భావిస్తున్నామని అన్నారు. నేరాలు తగ్గుముఖం పట్టాయని, రాష్ట్రాన్ని నక్సల్‌ ఫ్రీ తెలంగాణగా మార్చామని ఉద్ఘాటించారు. సురక్షితమైన దక్షిణ భారతం కోసం అందరూ కలిసి పనిచేయాలని దక్షిణ రాష్ట్రాల పోలీస్‌ అధికారులను కోరారు. తెలంగాణ తన సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఐసీసీసీ నమూనాను పొరుగు రాష్ట్రాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ సీ.వి. ఆనంద్‌ మాట్లాడుతూ, 1980ల్లో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు గ్రేహౌండ్స్‌ ఏర్పాటు చేశామని, దీనికి దేశవ్యాప్తంగా మంచి పేరుందని అన్నారు. తీవ్రవాద కార్యకలాపాలు అరికట్టేందుకు ఆక్టోపస్‌, డ్రగ్స్‌ నియంత్రణకు ఈగల్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశామని, డ్రగ్స్‌ ముఠాలపై అనేక ఆపరేషన్లు చేపట్టామని తెలిపారు. 824 మంది నక్సల్స్‌ లొంగిపోయి, 302 ఆయుధాలు అప్పగించారని, జీరో నక్సల్‌ స్టేట్‌గా తెలంగాణ మారిందని పేర్కొన్నారు.

ఐసీసీసీ ద్వారా ప్రకృతి విపత్తుల్లో సమర్థంగా సేవలు అందిస్తున్నామని, మహిళల భద్రత కోసం టీసేఫ్‌ యాప్‌ రూపొందించామని చెప్పారు.సమావేశంలో సైబర్‌ నేరాలు, నార్కోటిక్స్‌, సరిహద్దు నేరాలు, సమాచార మార్పిడి, సాంకేతిక పరికరాల వినియోగం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేస్తే నేరాల రేటు తగ్గి, ప్రజలకు మెరుగైన భద్రత అందించవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated On  saroj
Next Story