CM Revanth Reddy: రాష్ట్రంలో ఆరుతడి పంటలు, ప్రధానంగా కూరగాయల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ గురువారం ముఖ్యమంత్రిని ఎంసీహెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో కలిసి నివేదికను అందజేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, సంచాలకుడు గోపి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘కూరగాయల సాగుకు ప్రాధాన్యమివ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న కేంద్రీకృత వంటశాల పరిసర ప్రాంతాల్లో వీటి సాగుపై దృష్టి సారించాలి. రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు. నివేదికలోని అంశాలపై చర్చించేందుకు త్వరలో సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు.

సీఎంకు నివేదిక సమర్పించిన అనంతరం చిన్నారెడ్డి సచివాలయంలో మాట్లాడుతూ.. ‘‘ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతోపాటు భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోవడం వల్ల సాగు విస్తీర్ణం తగ్గింది. ఎల్‌నినోతో రాష్ట్రంలో ఏర్పడే సవాళ్లను ముందుగానే అంచనా వేసి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం’’ అని తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story