CM Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: గాంధీభవన్‌లో ఆదివారం జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) మరియు విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 శాసనసభ స్థానాలు యథావిధిగా ఉంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా కోటి ఓట్లు సాధించి 90 సీట్లు గెలుచుకుంటుందని ఆయన పేర్కొన్నారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుందని పునరుద్ఘాటించారు.
“నేను కార్యకర్తల నాయకుడిని. వారి ఆలోచనలు నాకు బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని మాత్రమే కార్యకర్తలు కోరుకుంటారు, పదవులు కాదు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే మన లక్ష్యం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 15 ఎంపీ సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎప్పుడూ అండగా నిలిచింది. ఇప్పుడు కూడా ఏకోన్ముఖులై, కార్యోన్ముఖులై రాహుల్‌ను ప్రధానిని చేద్దాం” అని సీఎం పిలుపునిచ్చారు.
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కేసీఆర్ పార్టీ నేతలను బలవంతంగా తమ వైపు తిప్పుకున్నారని, ‘తెలంగాణలో కాంగ్రెస్ లేదు’ అని చెప్పేవారని గుర్తు చేశారు. డిజిటల్ మెంబర్‌షిప్ ద్వారా 90 రోజుల్లో 48 లక్షల సభ్యత్వాలు చేయించామని, కార్యకర్తలు విజయమో వీరమరణమో అన్నట్లు పనిచేశారని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 92 లక్షల 35 వేల 833 ఓట్లు సాధించి 64 సీట్లు గెలిచామని, అది పూర్తిగా కార్యకర్తల కృషి ఫలితమని పేర్కొన్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరుగుతుందని సీఎం హామీ ఇచ్చారు. అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, బల్మూరి వెంకట్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సురేష్ షెట్కార్ వంటి వారికి పార్టీ గుర్తింపు లభించిందని ఉదాహరణలు ఇచ్చారు. మహేశ్‌కుమార్ గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం, పొంగులేటిని మంత్రిగా చేయడం వంటివి పార్టీ న్యాయం చేసిన సందర్భాలుగా పేర్కొన్నారు.
“పార్టీ లైన్‌లో ఉంటే పదవి మీ ఇంటికే వస్తుంది. గాంధీభవన్ చుట్టూ తిరగడం, ఢిల్లీలో పైరవీలు చేయడం వల్ల పదవులు రావు. గ్రామాలు, తండాలు, మారుమూల పల్లెలకు వెళ్లి పేదలకు ఆత్మబంధువులైన వారే నిజమైన నాయకులవుతారు” అని హెచ్చరించారు. చెడగొట్టేవారిని కూడా గుర్తుంచుకుంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణ, కులగణన, గిగ్‌వర్కర్ల చట్టం, ఉచిత బస్సు, ఇందిరమ్మ చీరలు, రైతు భరోసా, ఉచిత కరెంటు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని ఆయన చెప్పారు. సంక్రాంతి తర్వాత ప్రజల వద్దకు వెళ్లి ‘ప్రజాబలం’ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని, కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రారంభమైందని వివరించారు. ఓబీసీ కులగణనను 2027 జనగణనలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేశామని తెలిపారు. నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జి బి.ఎం. సందీప్‌ను స్వాగతించి, పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

