CM Revanth Reddy: ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026ను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

CM Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం బోధి పెవిలియన్‌లో ఈ పోటీల ఏర్పాట్లు, నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు.
డిసెంబరులో జరగనున్న ఈ జాతీయస్థాయి పోటీల్లో వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటున్నారని సీఎం పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని, హైదరాబాద్‌లోని క్రీడా మైదానాల్లో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రారంభ, ముగింపు వేడుకల్లో క్రీడాకారులు, సినీ ప్రముఖులను భాగస్వామ్యం చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్‌తో పాటు జాతీయస్థాయి క్రీడా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని, క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షలో క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, శాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, శాట్స్ ఎండీ సోనీబాలాదేవి పాల్గొన్నారు.

