CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి: తప్పులకు అవకాశం ఇవ్వకండి.. భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలి
భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలి

CM Revanth Reddy: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీని భాగంగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల వ్యవస్థను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పేర్కొన్నారు. భూమి కొలతలు, భూదస్త్రాల నిర్వహణ శాఖ పరిధిలో కొత్తగా నియమించిన సర్వేయర్లకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికపై లైసెన్సులు పంపిణీ చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘‘తెలంగాణ చరిత్రలో భూమి కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. రాజుల నుంచి కుమరం భీం, తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు అన్నీ భూమి హక్కుల కోసమే. ఇప్పుడు భవిష్యత్తులో భూ యాజమాన్య హక్కులు, సరిహద్దులు నిర్ణయించే అధికారాన్ని లైసెన్స్‌డ్ సర్వేయర్ల చేతుల్లో అప్పగించబోతున్నాం. తప్పులు చేస్తే మీతో పాటు ప్రభుత్వంపైనా ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది’’ అని సీఎం హెచ్చరించారు.
ధరణి చట్టం.. బీఆర్ఎస్ ఓటమికి మూలం
గత బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ చట్టాలను దుర్వినియోగం చేసుకుని భూములపై ఆధిపత్యం సాధించుకోవాలనుకున్నవారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని సీఎం తెలిపారు. ధరణి చట్టాన్ని ప్రజలు తిరస్కరించి ‘బంగాళాఖాతంలో విసిరేశారు’. ‘‘ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ ఓటమికి మాత్రం ధరణి చట్టమే ప్రధాన కారణం. అధికారంలోకి వచ్చాక ధరణి నుంచి ప్రజలను విముక్తి చేస్తామని చెప్పాను. చెప్పినట్టే చేశాం. ఆ చట్టం కొందరికి మాత్రమే లాభదాయకం. తహసీల్దారుపై పెట్రోలు పోసిన ఘటనలు, ఇబ్రహీంపట్నం హత్యలు లాంటివి దాని ఫలితాలే. పాత చట్టాలు లక్షలాది సమస్యలు సృష్టించాయి. రైతులు అధికారుల చుట్టూ తిరిగి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చింది’’ అని ఆయన వివరించారు.
వ్యవసాయాన్ని పండగలా చేయాలి
‘‘రైతు రాజు. వ్యవసాయం దండగ కాదు, మనమంతా కలిసి పండగలా చేయాలి. లైసెన్స్‌డ్ సర్వేయర్లు కష్టపడి పనిచేయాలి. శ్రమకు తగిన ఫీజు తీసుకోండి. రాష్ట్రంలో 1.60 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది. 140 ఏళ్లకు పైగా సర్వే చట్టాలు ఉన్నా సమస్యలు తగ్గలేదు. కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో భూసీలింగ్ చట్టంతో 25 లక్షల ఎకరాలు పేదలకు పంచాం. 2006లో అటవీ హక్కుల చట్టంతో 10 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చాం. 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టాలని విజన్-2047 డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. 2034కి ఒక ట్రిలియన్ డాలర్లు, 2040కి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలి. త్వరలో గ్రూప్-3,4లకు 11 వేల మందికి నియామక పత్రాలు అందిస్తాం’’ అని సీఎం ప్రణాళికలను వివరించారు.
రైతులకు దీపావళి కానుకగా లైసెన్సులు: పొంగులేటి
రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తెచ్చేలా లైసెన్స్‌డ్ సర్వేయర్లు పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. చిన్న తప్పులకు కూడా ఆస్కారం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా బాధ్యత తీసుకోవాలన్నారు. ‘‘దశాబ్దాల తరబడి తీవ్ర అసంతృప్తితో ఉన్న రెవెన్యూ వ్యవస్థకు ఇది దీపావళి కానుక. రైతులు, ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించేలా పనిచేయాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
