సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణలో పౌల్ట్రీని ప్రాధాన్య రంగంగా గుర్తించి సమస్యల శాశ్వత పరిష్కారానికి కొత్త విధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన పౌల్ట్రీ ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన-2026లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పౌల్ట్రీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు త్వరగా మంజూరు చేయడానికి బిల్డ్‌నౌ విధానాన్ని గ్రామాల దాకా విస్తరిస్తామని, కోళ్ల దాణా సమస్యను 48 గంటల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా గుడ్లు ఇవ్వడం, కోళ్లను పెంచడమే కాదు రైతుల ఆర్థిక శక్తిని కూడా బలోపేతం చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. రైతులు పండించిన మొక్కజొన్న, సోయా వంటి వాటిని ఈ పరిశ్రమలో ఉపయోగిస్తూ రైతులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. ఈ పరిశ్రమ ప్రతిసారీ లాభసాటి కాదని, కొన్నిసార్లు నష్టాలు ఉన్నా అన్నింటినీ తట్టుకొని నిలబడి కొనసాగడాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ప్రభుత్వం మారగానే విధానాలు మారిపోతున్నాయని, తెలంగాణలో ఆ పరిస్థితి లేదని, గత సీఎంలు అనుసరించిన ఉత్తమ విధానాలను కొనసాగిస్తూ మరింత మెరుగుపరుస్తామని వివరించారు.
ప్రతి 15 రోజులకు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి అనుమతులు, రాష్ట్ర వాటా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని సీఎం చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ కోసం పని చేస్తానని, ప్రభుత్వం నడపడం వేరు అని స్పష్టం చేశారు. 2034 నాటికి రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే పరిశ్రమలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, పెట్టుబడులు పెట్టండి, లాభాలు పొందండి అని పారిశ్రామికులకు పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీల్లో కోళ్లఫారం నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేలా త్వరలో మార్పు తెస్తామని ప్రకటించారు. ప్రభుత్వం దగ్గర రెండు సంవత్సరాలకు సరిపోయే సన్న బియ్యం నిల్వలు ఉన్నాయని, మొక్కజొన్న, సోయాబీన్ సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలకు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. 48 గంటల్లో సమీక్ష చేసి మంచి వార్త వినిపించాలని ఆదేశించారు.
ప్రదర్శనలో పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బయాస్ సీఎంను సన్మానించారు. మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో రోజుకు 5.3 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని సీఎం ప్రశంసించారు.

