CM Revanth Reddy: కొడంగల్‌పై సీఎం రేవంత్ ఫోకస్.. ఎత్తిపోతల ప్రాజెక్టులు, విద్యా పథకాలపై కీలక ఆదేశాలు
కీలక ఆదేశాలు
CM Revanth Reddy: కొడంగల్ నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు అందించేందుకు చేపట్టిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొడంగల్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి, రాత్రి హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఈ పథకం మూడు ఫేజ్‌ల పనులకు రూ.1,053 కోట్లు ఖర్చు చేశామని, ఫేజ్-2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి ఏటా అవసరమైన బడ్జెట్ వివరాలతో నివేదిక సమర్పించాలన్నారు. అధికారులు ఫేజ్-1 పనులను 2027 డిసెంబరు నాటికి, ఫేజ్-2ను 2028 అక్టోబరు నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భూత్పూర్ జలాశయం సామర్థ్యం పెంపు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
పర్యటనలో సీఎం నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల పనులను, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో బీసీ గురుకుల, జూనియర్ కళాశాలను, దుద్యాల మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్‌లోని వైద్య కళాశాల, ఆసుపత్రి తదితర నిర్మాణాలను పరిశీలించారు. మద్దూరులో డిగ్రీ కళాశాలకు అదనపు స్థలం కొనుగోలు చేయాలని, గురుకుల పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరానికల్లా అందుబాటులోకి తేవాలని సూచించారు. గతంలో ప్రజల అవసరాల కోసం రైతుల నుంచి సొంత డబ్బుతో కొని ప్రభుత్వానికి ఇచ్చిన స్థలంలో గురుకుల పాఠశాల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో, భూములిచ్చిన రైతులను గుర్తించి ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులు ఆలస్యం కావడంపై అసహనం వ్యక్తం చేస్తూ, వర్షాల సమయంలో నీటిని ఒడిసి పట్టి ల్యాండ్‌స్కేపింగ్‌కు వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో 4 వేల ఎకరాల్లో నిర్మించబోయే సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని, అక్టోబరులో పారిశ్రామిక, వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి తండాకు రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట పరిధిలో 81 కి.మీ. రేడియల్ రోడ్డు భూసేకరణను పూర్తి చేసి నవంబరు 1న పనులు ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాల్లో సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్లు దీపక్ తివారి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. శనివారం సీఎం నల్గొండ జిల్లాలో పర్యటించి నకిరేకల్‌లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.



