CM Revanth Reddy: సురేఖ కూతురు వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌కు తీవ్ర ఆగ్రహం.. పార్టీలో చర్యలు తప్పవని హెచ్చరిక
పార్టీలో చర్యలు తప్పవని హెచ్చరిక

CM Revanth Reddy: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది. ముఖ్యమంత్రిపై నేరుగా చేసిన విమర్శలు, ఆరోపణలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణా రాహిత్యంగా భావించి నోటీసులతోనే ఆపకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని ములుగు, పరకాలలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే స్థానిక మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ఇది చర్చనీయాంశమైంది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని సురేఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ వర్గీయులను అణగదొక్కుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. పరకాల బహిరంగ సభలో సీఎం రేవూరిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అన్న సంకేతం ఇచ్చినట్లు అర్థమైంది.
ఇది జరిగిన మరుసటి రోజే సురేఖ కుమార్తె సుస్మిత పరకాల నియోజకవర్గంలోని గీసుకొండలో సభ ఏర్పాటు చేశారు. అక్కడ ముఖ్యమంత్రిపైనా, స్థానిక ఎమ్మెల్యేపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి.
బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం గురువారం లండన్ పర్యటనకు బయలుదేరారు. ఢిల్లీలో ఉన్నప్పుడే కొందరు ముఖ్యనాయకులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రితోనూ, మరికొందరు మంత్రులతోనూ మాట్లాడి చర్యలు తప్పవని హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పీసీసీ క్రమశిక్షణా కమిటీ బుధవారం మంత్రి సురేఖకు నోటీసు ఇచ్చింది. దీనికి సమాధానంగా కుమార్తె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమేనని, తనను బాధ్యురాలిని చేయొద్దని గురువారం సమాచారం ఇచ్చారు.
ఇదే సమయంలో మంత్రి మాజీ ఓఎస్‌డీ సుమంత్‌పై గురువారం కేసు నమోదైంది. ఓ వ్యాపారిని బెదిరించి దాడి చేసినట్లు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఇలాంటి వివాదాల్లో పార్టీలోని కొందరి జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినా, తాజా పరిణామాల్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలనే అభిప్రాయం కూడా పార్టీలో కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. “ఎవరికి వారు ఎన్నికల్లో పోటీ చేస్తామంటే ఎలా? టికెట్లు ఇవ్వడంలో సీడబ్ల్యూసీ, అధిష్ఠానానిదే తుది నిర్ణయం. పార్టీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు” అని ఆయన అన్నారు.

