CM Revanth Reddy: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తెలంగాణలో సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు సంక్షేమం, విద్య, వైద్యం, నీటి హక్కులపై ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

సీఎం మాట్లాడుతూ, కృష్ణా-గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదని, తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని అన్నారు. త్వరలోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పిన సీఎం, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు, రైతు సంక్షేమం కోసం రూ.లక్షా 70 వేల కోట్లు కేటాయించినట్లు, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినట్లు వివరించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సృష్టించిందని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు ఇళ్లకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని తెలిపారు.

విద్యా రంగంలో ప్రగతి సాధించినట్లు చెప్పిన సీఎం, విద్యా సూచీలో 21వ స్థానం నుంచి 14వ స్థానానికి తెలంగాణ చేరుకుందని అన్నారు. నియోజకవర్గానికొక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టామని, వందకు పైగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు నిర్మించే లక్ష్యంతో ఉన్నామని, ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని వివరించారు. అక్రమాలు జరగకుండా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని, మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో జరిగే ఖేల్ ఇండియా పోటీలకు హైదరాబాద్ అతిథ్యం ఇస్తుందని అన్నారు.

వైద్య రంగంలో ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణంలో ఉందని, 8 కొత్త మెడికల్ కాలేజీలకు భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే సంకల్పంతో ఉన్నామని, మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశామని, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు అందజేశామని తెలిపారు.

15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, రెండో విడత పంపిణీ ఈరోజు ప్రారంభమైందని, 2 విడతల్లో 5.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందించనున్నామని అన్నారు. కొత్తగా 2.50 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామని, వృద్ధ తల్లిదండ్రుల కోసం చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన జరిగిందని, తెలంగాణ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణనలో కులగణన చేర్చిందని తెలిపారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం త్వరలో బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, మరో 78 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని, అమెజాన్ సంస్థ రాష్ట్రంలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని సీఎం వివరించారు. ప్రభుత్వం 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, తలసరి ఆదాయంలో టాప్‌లో ఉన్నామని అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం రైతు, మహిళ, విద్య, వైద్య, నీటి హక్కులపై ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story