CM Revanth Reddy: తుమ్మిడిహట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: రాష్ట్రంలోని ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తుమ్మిడిహట్టి బ్యారేజీ, డిండి, అచ్చంపేట ప్రాజెక్టులపై వివరంగా చర్చించారు.తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్రతో చర్చలు జరపడానికి అధికారులు సిద్ధం కావాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. మహారాష్ట్రలో ముంపు ప్రభావం, నీటి లభ్యతపై నివేదికలు సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.
డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీరు కేటాయించాలని, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదులకు అదనంగా 0.6 టీఎంసీల నీరు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పాలమూరు ప్రాజెక్టు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పంప్‌హౌస్‌లు, పంపులు, ఇతర వ్యవస్థల పనులు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

