Future City Project: సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన
ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన

Future City Project: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (సెప్టెంబర్ 28) శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) భవన నిర్మాణానికి ఆయన పునాది రాయి వేశారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని మీర్ ఖాన్ పేటలో 7.29 ఎకరాల స్థలాన్ని ఎఫ్‌సీడీఏకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎఫ్‌సీడీఏ భవనానికి, రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్–1కు సీఎం భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మొదలైనవారు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్యాల నియంత్రణకు ఇది సహాయపడుతుంది.
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 30 వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీని నిర్మించనున్నారు. 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరిస్తుంది. మహానగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి అనుగుణంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఫ్యూచర్ సిటీ కీలకమవుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ‘సింగిల్ విండో సిస్టమ్’ను అమలు చేయనున్నారు. ఎఫ్‌సీడీఏ కార్యాలయంలోనే భవన నిర్మాణం, లేఔట్లు, పారిశ్రామిక అనుమతులు వంటి అన్ని క్లియరెన్స్‌లు లభిస్తాయి. ఇది సుపరిపాలనకు కొత్త మార్గమని, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పెట్టేలా సూపర్-ఫాస్ట్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తారు. మహానగరాలకు ముఖ్యమైన ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీని ఫ్యూచర్ సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలతో అందుబాటులోకి తెస్తారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్)ను కలుపుతూ 100 మీటర్ల వెడల్పుతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మిస్తారు. రావిర్యాల నుంచి అమనగల్ వరకు 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నెం.1కు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.
రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలను కలిపే కొత్త ఈస్ట్-వెస్ట్ ట్రంక్ రోడ్డును నిర్మిస్తారు. టోల్ ఫీజు లేకుండా వేగవంతమైన ప్రయాణానికి సింగిల్-ఫ్లో మార్గాలను ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మెట్రో ఫేజ్ 2–బీకి అనుసంధానం చేస్తారు.
