నెలకు కనీసం 10 రోజులు క్షేత్ర పర్యటనలు తప్పనిసరి

CM Revanth Reddy: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సర్కారు విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యత కలెక్టర్లపైనే ఉందని స్పష్టం చేశారు. ప్రతి కలెక్టర్ పనితీరుకు మూడు నెలల కాలాన్ని కొలమానంగా నిర్ణయించామని, ఇది వారి కెరీర్‌కు పునాదిగా నిలుస్తుందని తెలిపారు.

కొందరు కలెక్టర్లు నెలలో ఐదు రోజుల కంటే తక్కువగా పర్యటిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, ప్రతి కలెక్టర్ నెలకు కనీసం 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అలా చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజల సమస్యలు ఎప్పటికీ అర్థం కావు. అధికారులు ప్రభుత్వానికి కళ్లు, చెవులు. ప్రభుత్వం-ప్రజల మధ్య వారధిగా పనిచేయాలి’’ అని ఉద్బోధించారు. వారి పనితీరును నిరంతరం మదింపు చేసి తనకు నివేదికలు అందజేయాలని ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా బోగస్ ఉద్యోగాల సృష్టి విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో 25 వేల మంది ఆధార్ కార్డు లేకుండా బోగస్ ఉద్యోగులుగా జీతాలు తీసుకున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ దందాకు పాల్పడిన ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, గత పదేళ్ల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని, కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

ధాన్యం సేకరణలో మిల్లర్ల దగ్గర ఉన్న రూ.3,900 కోట్ల విలువైన బియ్యాన్ని తిరిగి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని పేర్కొన్నారు. మోసాలకు పాల్పడే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై గట్టి వైఖరి అవలంబించాలని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

భూభారతి దరఖాస్తులన్నీ గడువులోగా పరిష్కరించాలని, అక్రమాలు జరిగితే వెంటనే గుర్తించాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో కలెక్టర్లు 100 శాతం భాగస్వాములు కావాలని కోరారు.

ప్రభుత్వం కలెక్టర్ల పనితీరును నిశితంగా గమనిస్తోందని, మంచి పని చేస్తే అభినందిస్తుందని, వార్షిక నివేదిక ఆధారంగా అవార్డులు, రివార్డులు ఇస్తామని తెలిపారు. జూన్‌లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

రోడ్ సేఫ్టీ విషయంలోనూ కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని, జిల్లాలవారీగా రోడ్ సేఫ్టీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. అలా చేయని వారి వివరాలను పనితీరు మూల్యాంకన నివేదికలో నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story