CM Revanth Reddy: తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగాఖాన్‌-Vతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. అగాఖాన్‌ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవముందని సీఎం వ్యక్తం చేశారు. మూసీ నది పునరుజ్జీవం, వారసత్వ భవనాల పునరుద్ధరణ, ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ వంటి అంశాలపై కీలక చర్చలు జరిగాయి.

సీఎం మాట్లాడుతూ ‘‘వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగాఖాన్‌ ఫౌండేషన్‌ది అత్యంత కీలకపాత్ర. ఫౌండేషన్‌ సాయంతో ఇటీవలే శాసనమండలి భవనం, కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరించుకున్నాం. మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్‌, ఉస్మానియా ఆస్పత్రి భవనాల పునరుద్ధరణకు సాయం కోరుతున్నాం’’ అని తెలిపారు.

ఉస్మానియా ఆస్పత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనం నిర్మిస్తున్నామని, ప్రస్తుత భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని సీఎం చెప్పారు. మూసీ నదిని నైట్‌ ఎకానమీ కోసం అభివృద్ధి చేస్తామని కూడా వెల్లడించారు.

డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పి, ప్రిన్స్‌ రహీమ్‌ అగాఖాన్‌ను తప్పక హాజరు కావాలని ఆహ్వానించారు.

2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం అన్నారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని, ఇది నెట్‌-జీరో సిటీగా ఉండబోతుందని చెప్పారు. ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల దూరంలో ఈ నగరం నిర్మాణమవుతోందని, సింగపూర్‌కు చెందిన కంపెనీ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తోందని, 15 వేల ఎకరాల్లో గ్రీన్‌ జోన్‌ ఏర్పాటు చేస్తున్నామని, అమెజాన్‌ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Next Story