CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో పర్యటిస్తూ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, నీటి వనరులు సంబంధిత కీలక అంశాలపై వారితో చర్చించారు.

ముందుగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రహదారులకు శాఖాపరమైన అనుమతులపై చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, ఎస్‌ఆర్వీ ఆర్‌ డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం భేటీ అయ్యారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై ప్రధానంగా చర్చించారు. మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు. 148 మీటర్ల ఎత్తునకు గతంలోనే మహారాష్ట్ర అంగీకరించిందని తెలిపిన సీఎం, 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి ఆ రాష్ట్రాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. 150 మీటర్లకు పెంచినా ముంపు 1000 హెక్టార్ల లోపే ఉంటుందని వివరించారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తిపోతల ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story