CM Revanth Reddy: విదేశీ ఉన్నత విద్యకు ఇచ్చే ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ తరహాలో బ్లూకాలర్‌ ఉద్యోగాల కోసం శిక్షణ పొందే వారందరికీ ఉపకారవేతనాలు ఇచ్చే అవకాశాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విదేశీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ఉద్యోగ మేళాల నిర్వహణతో పాటు పాస్‌పోర్టు, విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తెలంగాణ ఓవర్‌సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ (టామ్‌కామ్‌) తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం హైదరాబాద్‌లో శక్తి శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్‌లను స్కిల్స్‌ వర్సిటీలోకి తీసుకురావడం, ఆధునిక కోర్సులపై చర్చించారు. ఏటీసీలు, పాలిటెక్నిక్‌లలో చదివిన విద్యార్థులకు వెంటనే ఉపాధి లభించేలా శిక్షణ అందించాలని ఆదేశించారు.

‘‘దేశంలో, విదేశాల్లో నర్సుల సేవలకు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. ఆ మేరకు కొత్త నర్సింగ్‌ కళాశాలలు మంజూరు చేస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్నందున ఇంటికో నర్సు అవసరం ఏర్పడుతోంది’’ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్మికులను విదేశాలకు తరలించే ఏజెంట్ల సమాచారం సేకరించి, వారు పంపించిన వ్యక్తుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. టామ్‌కామ్‌, విదేశీ ఉపాధి వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఐఎఫ్‌ఎస్‌ మాజీ అధికారిని సీఈవోగా నియమిస్తామని తెలిపారు.

ఏటీసీల్లో అత్యాధునిక కోర్సులకు ప్రాధాన్యమివ్వాలని, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులు పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. ఏటీసీల్లో ఈవీ సర్వీసులు, డ్రోన్‌ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు. ఈవీల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వాటిని సర్వీసింగ్‌ చేయగల నిపుణులు కీలకమని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతున్నందున డ్రోన్‌ టెక్నాలజీ కోర్సులు ఉండాలని స్పష్టం చేశారు.

యంగ్‌ ఇండియా నైపుణ్య వర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని, జపనీస్‌, చైనీస్‌, రష్యన్‌ తదితర భాషలు నేర్పేందుకు స్కిల్స్‌ వర్సిటీలో ప్రత్యేక విభాగం నెలకొల్పాలని సూచించారు. విదేశీ భాషలు నేర్పించేందుకు స్థానికంగా ఆ భాషలో పట్టున్నవారితో పాటు ఆయా దేశాల నిపుణులను రప్పించాలన్నారు. ఉద్యోగార్థులకు లైట్‌, హెవీ మోటారు వాహన డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించాలని, ఉత్తర తెలంగాణ నుంచి పెద్దసంఖ్యలో కార్మికులు అరబ్‌ దేశాలకు వెళ్తున్న నేపథ్యంలో ఏజెంట్ల చేతిలో మోసపోకుండా టామ్‌కామ్‌ ద్వారా మ్యాన్‌పవర్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలని సీఎం సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story