CM Revanth Reddy: ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీని దొరల గడీల ముందు మోకరిల్లనని ధైర్యంగా చెప్పిన వ్యక్తిగా సీఎం రేవంత్‌రెడ్డి వర్ణించారు. అందెశ్రీ తనకు ఆత్మబంధువని పేర్కొన్న సీఎం, ఆయన జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో ‘అందెశ్రీ స్మృతివనం’ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అందెశ్రీని ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రజా గాయకుడు గద్దర్‌ను కూడా ప్రగతి భవన్ గేటు ఎదుట ఎర్రటి ఎండలో నిలబెట్టి అవమానించారని గుర్తు చేశారు. వారిద్దరిని అవమానించినప్పుడే ప్రజలు దొరలను సాగనంపాలని నిర్ణయించుకున్నారని అన్నారు.

ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై మండిపడిన సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చారని, తాము ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా చెబుతున్నారని ధ్వజం ఎగురవేశారు. “నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాల గురించి బీఆర్‌ఎస్ పాలకులు ఒక్కరోజైనా ఆలోచించారా? 16 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చి గ్రూప్-1 నిర్వహించాం. బీఆర్‌ఎస్ పాలనలో ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే దాదాపు 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం. తల్లిదండ్రుల సాక్షిగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం” అని వివరించారు.

కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని దోచుకుని శ్రీమంతులైందని ఆరోపించిన సీఎం, “కేసీఆర్ 1000 ఎకరాలు, కేటీఆర్ 100 ఎకరాలు, హరీశ్‌రావు 50 ఎకరాలు, కవిత 25 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. నిజాం రాజును మించిన ధనవంతులు ఎలా అయ్యారు? కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు క్షమించారని అనుకుంటున్నారా? నేనున్నంత వరకు బీఆర్‌ఎస్ సర్కారు మరోసారి రానివ్వను. తెలంగాణను దోచుకోవాలని చూస్తే అందెశ్రీ మళ్లీ పాటై పుడతాడు” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story