CM Revanth Reddy Suggests: పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై సమర్థ వాదనలు సమర్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి సూచన
సమర్థ వాదనలు సమర్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి సూచన

CM Revanth Reddy Suggests: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును (పీఎన్‌ఎల్‌పీ) అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత నెలలో ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ రిట్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సింఘ్వీకి సూచించారు. అవసరమైన ఆధారాలను సిద్ధం చేసుకోవాలంటూ నీటిపారుదల శాఖ ఇంజినీర్లను ప్రభుత్వం హెచ్చరించింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై విస్తృత చర్చ జరిగింది.
అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు
పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ లేదా నల్లమలసాగర్ జలాశయానికి లింక్ చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని తెలంగాణ తన రిట్ పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది. ఈ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అనుమతించిన పరిధికి మించి పోలవరం ప్రాజెక్టును విస్తరించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. తెలంగాణ పలు అభ్యంతరాలను కేంద్రానికి తెలిపినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టును (పీఎఫ్‌ఆర్) కేంద్రం పరిశీలిస్తుండటం సరికాదని వాదించింది. ఈ విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టకుండా జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించింది.
డీపీఆర్ తయారీపై అడ్డుకట్ట వేయాలి
తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) తయారీకి ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ డీపీఆర్ పనులు ముందుకు సాగకుండా చూడాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న లింక్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరింది.

